ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
‘అనంత’ కబ్జా‘రాయుళ్లు’

తాడిపత్రి: మీరు పేదలా..? బలం, బలగం లేనివారా? తాడిపత్రిలో మీకు స్థలముందా? అయితే... దాని గురించి మరచిపోండి. ఇప్పటికే మీ స్థలాన్ని కబ్జాచేసి ఉంటారు! ఇతరులకు అమ్మేసి ఉంటారు. అక్కడ ఇళ్లు కూడా కట్టేసి ఉంటారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల వద్దకెళ్లినా మీకు న్యాయం జరగదు. సివిల్‌వ్యాజ్యమని, కోర్టుకెళ్లమని ఓ ఉచిత సలహా ఇస్తారు అంతే..! తాడిపత్రి పట్టణంలో ఆరు ముఠాలు భూకబ్జాలే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నాయి. పలుకుబడి కలిగిన కొందరు నేతల ప్రాపకం సంపాదించి, వారి పేరు చెప్పుకుని కబ్జాలకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. కబ్జాకోరల్లో చిక్కి వందలాది మంది పేద, మధ్యతరగతి వారు లబోదిబోమంటున్నారు.

ఈ ముఠాలకు కొందరు రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఒకరిద్దరు సిబ్బంది ద్వారా మొత్తం సమాచారం కబ్జాదారులకు చేరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాడిపత్రి పట్టణంతో పాటు పరిసరాల్లోని భూములు, స్థ్థలాల వివరాలను, కొన్నేళ్లుగా ఎటువంటి లావాదేవీలూ జరగని భూముల వివరాలను అందిస్తున్నారనే విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్‌ కాపీలతో పాటు పెన్‌డ్రైవ్‌ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నట్లు సమాచారం. ఇక కొందరు రెవెన్యూ ఉద్యోగులు సైతం నకిలీ రేషన్‌కార్డులు, పాసుబుక్‌లిచ్చి కబ్జాదారులకు సహకరిస్తున్నట్లు సమాచారం.

రిజిస్ట్రేషన్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఊర్లోలేని పేదలు, బలహీన వర్గాల వారి స్థలాలను గుర్తిస్తారు. డాక్యుమెంట్‌ కూడా రాయించి, దొంగ రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. కొందరు రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో నకిలీ రేషన్‌కార్డు లేక పాసుబుక్‌ తయారు చేయిస్తారు. రాత్రికి రాత్రే ఈ స్థలాలు అమ్మి కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు.

కబ్జాకు గురైన పేదల స్థలాల వివరాలు...
ప్రభుత్వం 420 మంది నిరుపేద ముస్లిం బీడీ కార్మికులకు ఎస్‌జేకే స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద ఇళ్ల స్థలాలిచ్చింది. సర్వే నంబర్‌ 253-ఏలో 13 ఎకరాల 72 సెంట్లు, 253-బీలో మూడెకరాల 27 సెంట్లు... మొత్తం 16 ఎకరాల 99 సెంట్లలో ఒక్కొక్కరికి 2.50 సెంట్ల చొప్పున 17-07-1994న పట్టాలిచ్చారు. తర్వాత అధికారులు పక్కాగృహాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరితో రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు పెట్టించారు. చివరకు చేతులెత్తేశారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకునే శక్తిలేని పేదలు స్థలాలను అలాగే ఉంచారు. ప్రస్తుతం ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. దీంతో కోట్లాది రూపాయలు విలువచేసే పేదల స్థలాలపై కబ్జాదారుల కన్ను పడింది. స్థలం తమదంటూ ఒకరిద్దరు కబ్జాదారులు బోర్డులు కూడా నాటారు.

పట్టణ వాసి ఎస్‌ఏ పెద్దకాశీంసాబ్‌కు చెందిన స్థలాన్ని ఓ ముఠా కబ్జా చేసింది. సర్వేనంబర్‌ 496లో మూడు సెంట్ల స్థలాన్ని పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అమ్మానని, రిజిస్ట్రేషన్‌ సమయంలో తమకు తెలియకుండా డాక్యుమెంట్లలో 3కు ముందు ఒకటి పెట్టి 13 సెంట్ల స్థలాన్ని కబ్జాచేశారని పెద్దకాశీంసాబ్‌ వాపోయాడు.

పట్టణానికి చెందిన బండి లకిదేవమ్మకు సజ్జలదిన్నె వద్ద సర్వే నంబర్‌ 783లో ఉన్న ఆరెకరాల 61 సెంట్ల స్థలం కబ్జాకు గురైంది. ఓ ముఠా రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది, కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, పాసుబుక్కులను సృష్టించి దాదాపు 70 లక్షలకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే స్థలాన్ని వెంటనే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి పేరుతో బోగస్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు! బండి లకిదేవి సంబంధీకుల విచారణలో విజయవాడలో ఆ అడ్రస్‌కానీ, ఆ పేరు వున్న వ్యక్తికానీ లేడన్నది స్పష్టమైంది.

పట్టణ శివారులో డేవిడ్‌ అనే వ్యక్తికి సర్వేనంబర్‌ 430-బీ, మరి కొన్ని నంబర్లలో 6 ఎకరాల 34 సెంట్ల పొలముంది. ఈ పొలం మొత్తం రైల్వే డబుల్‌లైన్‌ కోసం ప్రభుత్వం తీసుకొంది. ఏడాది గడిచినా డేవిడ్‌కు పరిహారం అందలేదు. ఈ విషయంపై ఆరా తీయగా పరిహారం మొత్తాన్ని ఎప్పుడో చెల్లించినట్లు అధికారులు తేల్చిచెప్పారు. పరిహారం ఎవరికిచ్చారో తెలియక డేవిడ్‌ ఏడాదిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.

పట్టణంలోని విజయనగర్‌ కాలనీకి చెందిన దోబూరి రమేష్‌ స్థలాన్ని (సర్వేనంబర్‌ 362-ఏ) ఓ ముఠా కబ్జాచేసింది. పేదవాడైన రమేష్‌ స్థలం కోసం పెద్ద పోరాటమే చేశాడు. పోలీసుకేసు పెట్టాడు. అయినా ఆ ముఠా వెనక్కు తగ్గలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణంలో వందలాది మంది పేద, మధ్యతరగతి వారి ఆస్తులను కబ్జా చేశారు. బాధితులు న్యాయం కోసం పోలీసుల వద్దకెళితే సివిల్‌ వ్యాజ్యం కనుక రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లాలని సలహా ఇస్తున్నారు. ఇక రెవెన్యూ వారు కబ్జాదారుల నుంచి ముడుపులు తీసుకుని, కోర్టులోనే తేల్చుకోండంటూ బాధితులకు ఉచిత సలహాలిస్తున్నారు.

ఎస్పీ వైపు... బాధితుల చూపు...
జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ మనీష్‌కుమార్‌ సిన్హా కఠినంగా, నిజాయితీగా వ్యవహరిస్తారన్న పేరుండటంతో బాధితుల చూపు ఆయన వైపు మళ్లింది. ఎస్పీని కలిసి విన్నవించేందుకు సమాయాత్తమవుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు బాధితులు తెలిపారు.

న్యాయం చేయాలి...
- రసూల్‌బీ, తాడిపత్రి
15 ఏళ్ల క్రితం 420 మందికి పట్టాలిచ్చారు. ఇళ్లు ఇస్తామని డబ్బులు తిన్న అధికారులు పత్తాలేకుండా పోయారు. ఇప్పుడు మా స్థలాలను ఆక్రమించారు. మాకు న్యాయం చేయాలి.

పరిహారం ఎవరికిచ్చారో తెలీదు
- డేవిడ్‌, వంగనూరు
నా పొలాన్ని మొత్తం రైల్వే డబుల్‌లైన్‌ కోసం ప్రభుత్వం తీసుకుంది. నష్టపరిహారం ఎవరికో ఇచ్చేశారు. దీంతో నేను అన్యాయానికి గురయ్యా. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.

నా భూమి అమ్మేశారు
- బండి లకిదేవమ్మ, తాడిపత్రి
నా మనవడు ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నాడు. నేనూ కొద్ది రోజులు అక్కడున్నాను. ఇంతలోపే కొందరు నేను భూమి అమ్మినట్లు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి, దాన్ని వేరేవాళ్ల అమ్మేశారు. రెవెన్యూ అధికారులు కూడా వారికి పాసుబుక్కులు ఇచ్చారు.


 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర