|
|
రైతుల కష్టాలు కొల్లేరు పాలు
ఏలూరు: కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో వరి సాగు చేయకూడదు. చెరువులు ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపట్టకూడదు. సంప్రదాయ చేపల వేటకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి కొందరు పెద్దలు కొల్లేరు ప్రాంతంలో వందల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. మెరక ప్రాంతాల్లో నీటిని బయటకు తోడేసి నాట్లు వేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీటిని తోడటం కొనసాగిస్తూనే ఉన్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరో వంద ఎకరాల వరకూ సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏలూరు మండలం మొండికోడు గ్రామ పరిసర ప్రాంతాల్లోని కొల్లేరులో వందలాది ఎకరాలలో అక్రమంగా వరిసాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొల్లేరును ప్రక్షాళన చేసిన ప్రభుత్వ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. కాంటూరు పరిధిలో ఉన్న మొండికోడు గ్రామానికి నాలుగు పక్కల కొల్లేరు విస్తరించి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో గ్రామస్తులు బంట్వాడాలుగా ఏర్పడి వరిసాగు చేసేవారు. కొల్లేరు ప్రక్షాళన తరువాత ఈ ప్రాంతం ప్రస్తుతం నీటితో కళకళలాడుతోంది. చేపలు కిలకిల్లాడుతూ పెరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి వివిధ జాతుల పక్షులు విడిది కోసం ఇక్కడకు చేరుతున్నాయి.
దీంతో కొల్లేరుకు పూర్వ వైభవం వస్తోందని ప్రకృతిప్రేమికులు.పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించేవారు సంబరపడిపోతున్నారు. సంప్రదాయ చేపల వేటపై జీవనం సాగించే కొల్లేరు గ్రామాల వాసులకు భుక్తికి లోటులేకుండా నడుస్తోంది. ఈ సమయంలో కొందరు పెద్దలు కొల్లేరును ఆక్రమించి వరిసాగు చేయడం మొదలుపెట్టారు. మొండికోడు గ్రామం ఎగువ, దిగువ ప్రాంతాలలో సుమారు 200 ఎకరాలలో వరినాట్లు వేశారు. గత రెండు రోజుల నుంచి దిగువున ఉన్న ఉప్పరదొడ్డి (కొల్లేరు)లోని నీరు తోడి మరో వంద ఎకరాలలో వరిసాగు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఆయిల్ ఇంజిన్లతో నీరు మళ్లింపు...
కొల్లేరులో లోతు తక్కువగా ఉన్న నీటికయ్యల ప్రాంతాన్ని ఎంచుకుని, అందులోని నీటిని ఆయిల్ ఇంజిన్లు ద్వారా మరీలోతు ఎక్కువ ఉన్న సరస్సులోకి తోడేస్తున్నారు. నీరుతోడేయ్యడంతో చిత్తడిగా మిగిలిన నేలల్లో నేరుగా నాట్లు వేసేస్తున్నారు. గత రెండురోజులుగా ఉప్పర్ల దొడ్డి రోడ్డు పక్కన పది ఇంజన్లు ఏర్పాటు చేశారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి నీటిని తోడేస్తున్నారు. అదేవిధంగా అక్కడికి కుడి పక్కగా మరో ఐదు ఇంజన్లను ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. పగలు కొంత తక్కువ సమయంలోనే నీటిని తోడుతున్నారు. రాత్రి వేళల్లో మాత్రం నిర్విరామంగా ఈ పనులు సాగుతున్నాయి. అధికారులు ఎవరైనా వస్తే గమనించి జాగ్రత్తపడేందుకు వీలుగా కొందరు వ్యక్తులు పహారా కాస్తున్నారు. దీని కోసం వేలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు.
భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయి...
ఈ ప్రాంతంలో ఎకరానికి 40 నుంచి 45 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ అక్రమసాగు చేస్తున్న రైతులు అంచనా వేస్తున్నారు. అందుకే వ్యయప్రయాసలకు ఓర్చి సాగుకు ఉపక్రమించారు. వరిసాగుకు కావాల్సినంత నీరు కొల్లేరులో అందుబాటులో ఉండటం కలిసివచ్చిన అవకాశం వారు భావిస్తున్నారు. ఈ అక్రమసాగు రైతులు గ్రామ స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకూ ముడుపులు అందజేయడం వలనే వారు ఇటువైపుగా కన్నెత్తికూడా చూడటం లేదనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల జాడే కానరావడం లేదని మీడియా పరిశీలనలో వెల్లడైంది. బడా రైతులతో లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నందు వల్లే అధికారులు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం లేదని స్థానికులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
జీవరాసులకు ముప్పు...
ఇంజిన్లతో నీరు తోడటం వల్ల చేపలు, పాములు, కప్పలు తదితర జీవరాసులకు ప్రాణహాని జరుగుతోంది. అనేక పాములు, కప్పలు మృతి చెందటంతో వాటిని రోడ్డుపై పడేస్తున్నారు. నాట్లు వేసిన తరువాత పైరు ఏపుగా పెరిగేందుకు,తెగుళ్ల నివారణకు, దిగుబడి పెంచేందుకు వివిధ ఎరువులు,పురుగుమందులు వాడాల్సి ఉంటుంది. వీటి వలన కొల్లేరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, పక్షులు,చేపలు తదితర జీవరాసుల ప్రాణాలకు ముప్పుఏర్పడే అవకాశాలు ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
|