|
|
ఉపాధి హామీ కూలి రూ.125?
రూ.83 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణం
విద్యాశాఖాధికారులపై ఆగ్రహం
జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు
ఏలూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లా, మండల పరిషత్‌ల పరిధిలో రూ.83 కోట్లతో లింక్‌రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు చెప్పారు. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మేకా శేషుబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలి త్వరలోనే రూ.100 నుంచి 125 వరకు పెరిగే అవకాశాలున్నాయన్నారు. అందరూ కలిసి సమష్టిగా పాల్గొని లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. రోడ్ల నిర్మాణానికి మార్చి 31వ తేదీతో గడువు ముగుస్తోందని త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన సర్వేలో బోగస్ గృహ లబ్ధిదారులుగా 9,900 మందిని గుర్తించి వారిని తొలగించామన్నారు.
వీరి స్థానంలో అర్హులైన 13 వేల మంది ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిగితే ఆహ్వానించడం లేదని జెడ్పీ చైర్మన్ విద్యాశాఖాధికారులపై మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా చెప్పకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డీఈవోను వచ్చి తనను కలవాల్సిందిగా ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన మూడవ స్థాయీ సంఘ సమావేశం రబీ మినుము పంటను నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల రత్నం, మట్టా సత్యనారాయణ, పోతుల అన్నవరం, గారపాటి రామసీత, జ్యోత్స్న, ఈదా వెంకటరత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
|