|
|
నీటి కష్టాలు తప్పవా?
వరంగల్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా జిల్లాలో వేసవికాలం రాకముందే మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణం కంటే 38.7 శాతం తక్కువగా వర్షపాతం నమోదు అయింది. ఫలితంగా 17,730 చేతిపంపుల్లో 341 చేతిపంపులు వట్టిపోయాయి. ఎండలు ముదరకముందే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ నాటికి మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో 3,455 మంచినీటి పథకాలు ఉండగా, వీటిలో 37 పథకాలు అసలే పనిచేయటం లేదు. అదేవిధంగా ఎస్సారెస్పీ నీటి ఆధారంగా నర్సంపేట, హసన్‌పర్తి, హన్మకొండ, ములుగు, గీసుకొండ, ఖానాపూర్, మహబూబాబాద్ మండలాల్లో కొనసాగుతున్న మంచినీటి పథకాలు కూడా ప్రజలకు తాగునీటిని అందించలేక పోతున్నాయి. ఫలి తంగా రెండు పట్టణాలు, 15 గ్రామాల ప్రజ లు తాగునీటి ఎద్దడి ఎదుర్కొం టున్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో వరంగల్ నగరం, జనగామ పట్టణాలతో సహా చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట, కురవి, మరిపెడ, నెక్కొండ, డోర్నకల్, నెల్లికుదురు, నర్సింహులపేట, పాలకుర్తి, తొర్రూరు, భూపాలపల్లి మండలాల పరిధిలోని 25 హాబిటేషన్లల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. కాగా, ఇప్పటికే గ్రామాల్లో మంచినీటి కోసం ఆందోళనలు మొదలవుతున్నాయి. శాయంపేట మండలం ప్రగతి సింగారం మహిళలు ఖాళీ కుండలతో తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. హన్మకొండలో గ్రామస్తులు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మరికొద్ది రోజుల్లో నీటి ఎద్దడి జిల్లాలోని అనేక గ్రామాల్లో నెలకొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రత్యామ్నాయ చర్యల్లో ఆర్‌డబ్ల్యూఎస్...
గత ఏడాది కరువు నిధుల కింద మంచినీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.75 లక్షలతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. 154 ఓపెన్‌వెల్స్ పూడిక తీయడంతో పాటు లోతు కూడా పెంచుతున్నారు. అదేవిధంగా కొత్తగా 461 బోర్‌వెల్స్ వేశారు. 80 బావుల్లో పూడిక తీశారు. జిల్లాలో మంచినీటి కొరతను పరిష్కరించడానికి మొత్తంగా 1052 పనులు చేపట్టటానికి రూ.131 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మండలానికి రెండేసి చొప్పున బృందాలను ఏర్పాటు చేసి రిపేరులో ఉన్న చేతిపంపులు, మంచినీటి పథకాలను గుర్తించి పనిచేసే విధంగా చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లలో మొత్తం 100 మంది సిబ్బంది పనిచేసినట్లు పేర్కొంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈనెల 20 నుంచి నెలరోజుల పాటు చేతిపంపులు, బావులు, మంచినీటి పథకాలపై దృష్టి సారించనున్నారు.
ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవేట్ బావులు, బోర్లు అద్దెకు తీసుకుని మంచినీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
|
|
|