|
|
'ఉద్యమ' సంకెళ్లు వీడవా?
వరంగల్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కమిటీ నియమించినప్పటికీ, ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల ఊసెత్తకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. 2009 నవంబర్ 29న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలో భాగంగా జిల్లాలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడంతో పాటు ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయలన్నా విషయం తెలిసిందే. కానీ, పోలీసులు ఈ విషయం పట్టించుకోకుండా కేసులు నమోదైన ఉద్యమకారులను అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నారు. కేసులు నమోదైన ఉద్యమకారులు తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేసుల వివరాలు...
జిల్లాలోని 21 సర్కిళ్ల పరిధిలో జరిగిన ఆందోళనలలో పోలీసులు 69 కేసలు నమోదు చేసి 321 మందిపై అభియోగం మోపారు. వీరిలో 271 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు, వీరిలో కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. మరో 50 మంది అరెస్టుకు పోలీసులు రంగం సిద్ద్ధం చేశారు. తెలంగాణ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సి.ఆర్.పి.సి. 151 యాక్టు కింద ముందస్తుగా 95 కేసులు నమోదు చేసి 2,225 మందిని అదుపులోకి తీసుకుని సొంతపూచికత్తుపై వదిలి వేశారు.
|
|
|