ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
బహుళ అంతస్తుల భవనాల్లో భరోసా లేక ప్రజల ఆందోళన

- నిబంధనలకు నీళ్ళు
- చోద్యం చూస్తున్న ప్రభుత్వం
ఏలూరు: హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న సంఘటనలను పరిశీలిస్తే అపార్టుమెంట్లు, ప్రైవేటు ఆసుపత్రుల భవనాల్లో ప్రజల ప్రాణాలకు భరోసా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న జనాభాకు తోడు ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతున్న వలసవల్ల నగరీకరణ రోజురోజుకు విస్తృతంగా పెరిగిపోతోంది. ఫలితంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతి కల్పన గగనంగా మారుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వసతి కోసం సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే స్ధలాలు దొరకని పరిస్ధితి నెలకొంది. దాంతో బహుళ అంతస్తుల నివాస భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సంపాదించిన సొమ్ములో ఎంతోకొంత అపార్టుమెంట్లలో ప్లాట్‌ కొనుగోలుకు వెచ్చించడానికి ఎవరూ కూడా వెనుకాడని స్ధితి. ఉద్యోగులు, వ్యాపార వర్గాల ప్రజలు అపార్టుమెంట్లలో ప్లాట్స్‌ కొనుగోలుకు అనివార్య పరిస్ధితుల్లో సుముఖత అవసరం ఏర్పడింది. ఈ ఒక్క కారణమే అపార్టుమెంట్ల నిర్మాణాల సంస్కృతిని నగరాలు, పట్టణాల్లో పెంచి పోషిస్తున్నది. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ వంటి మహానగరాలకే కాకుండా కోస్తా ప్రాంతంలో వాణిజ్య ప్రధాన కేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో దశాబ్ద కాలం నుంచి అపార్టుమెంట్ల నిర్మాణం ఒక వ్యాపారంగా మారిపోయింది. బిల్డర్లు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని లాభదాయక వ్యాపారంగా భావిస్తూ పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపడుతున్నారు. వాస్తవానికి పచ్చని పంట పొలాలతో ప్రకృతి సహజ సిద్ధమైనశోభను సంతరించుకుని ప్రశాంతతకు నిలయంగా కనిపించే విశాఖ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో ప్లాట్స్‌ కొనుగోలుకు సిద్ధపడే వారి సంఖ్య కోకొల్లలుగా కనిపిస్తున్నది. మరోవైపు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అనివార్యమన్న ప్రచారం బలంగా సాగుతూ ఉండడంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇప్పటికే దెబ్బతింది. సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని విజయవాడ అవుతుందన్న ప్రచారం వల్ల గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, భీమవరం పరిసర ప్రాంతాల్లో అమాంతం భూముల ధరలకు రెక్కలువచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ పుంజుకోగా అపార్టుమెంట్ల నిర్మాణం రెట్టింపు అవుతోంది. బిల్డర్లకు కాసుల వర్షం కురుస్తోంది. వ్యాపారం పెంచుకుని డబ్బును సమకూర్చుకోవడానికి బిల్డర్లు అపార్టుమెంట్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు, ప్రజల భద్రతకు తిలోదకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ నారాయణ గూడలో నిర్మాణంలో ఉన్న నాలుగ అంతస్తుల భవనం కుప్పకూలి 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ సంఘటనకు ముందు హైదరాబాద్‌లో కార్పొరేట్‌ రంగానికి చెందిన పార్క్‌ ఆసుపత్రి భవనం అగ్నికీలల్లో చిక్కుకుని రోగుల ప్రాణాలకు ముప్పువాటిల్లే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఈ రెండు సంఘటనల్లో ప్రాధమికంగా తేలిన కారణాలు ఒక్కటే. సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని. భద్రతా ప్రమాణాలకు కూడా తిలోదకాలు ఇచ్చారని. ఈ సంఘటనలను నేపధ్యంగా తీసుకుంటే బహుళ అంతస్తుల భవనాలను విచ్చలవిడిగా నిర్మిస్తున్న కోస్తా ప్రాంతంలోని ప్రధాన ప్రాంతాల్లో అదే తరహ లోపాలు చోటుచేసుకుంటున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన అపార్టుమెంట్ల భద్రతపైనా అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసి ప్రజల భయాందోళనలను తొలగించే పరిస్ధితుల్లో ప్రభుత్వ విభాగాలు లేవంటే ఆశ్చర్యమేమరి. గత ఏడాది విశాఖపట్నంలో 1996లో నిర్మాణంలో ఉన్న ఒక భారీ అపార్టుమెంట్‌ కుప్పకూలిపోయిన సంఘటన మరువకముందే 1998లో మరోకటి, 2008లో ఇలాంటి రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ మహానగరం విస్తీర్ణం పెరగడంతో ఇప్పటి వరకు లక్ష అపార్టుమెంట్ల నిర్మాణం సాగినట్లు అంచనా. ఇంకా మరో 20 వేల అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇవన్నీ బహుళ అంతస్తుల భవనాలే. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఏలూరు నగరంలో ఇప్పటి వరకు సుమారు 50 అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది. మరో 25 వరకు నిర్మాణంలో ఉన్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో వందకు పైగా నిర్మాణాలు జరిగాయి. మరో వంద నిర్మాణంలో ఉన్నాయి. వీటిపై మున్సిపాల్టీలు, నగర పాలక సంస్ధకు చెందిన ఏ అధికారి కూడా అజామాయిషీ, పర్యవేక్షణ చేసే అధికారాలు లేకపోవడంతో ఆయా అపార్టుమెంట్ల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. అపార్టుమెంట్లను నిర్మించేటప్పుడు ప్రతీ అంతస్తుకు సంబంధించిన డిజైన్‌ రిపోర్టును కార్పొరేషన్‌, మున్సిపాల్టీలకు చెందిన అధికారులకు సమర్పించాల్సి ఉన్నా సంబంధిత ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. పైగా బిల్డర్లు తమ నిర్మాణాల బాధ్యతలను ప్రైవేట్‌ ఇంజనీర్లకు అప్పగించడం వల్ల వారికి ప్రజల భద్రతకు సంబంధించిన ఏ బాధ్యతా లేకుండా పోతోంది. కార్పొరేషన్‌ స్ధాయిలో సిటీ ప్లానర్లు, మున్సిపాల్టీల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఉన్నప్పటికి వారు బహుళ అంతస్తుల భవనాలకు నిబంధలనల ప్రకారం జీవోలు చూసి అనుమతి ఇవ్వడం తప్ప వాటి నిర్మాణాలపై ఎటువంటి నివేదికలను పరిశీలించే అధికారాలు లేవని నిస్సహాయత వ్యక్తం చేయాల్సి వస్తుందని ఏలూరు కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి సిటీ ప్లానింగ్‌ అధికారి రవి 'న్యూస్‌ ప్రతినిధి'కి తెలిపారు. భవనాల నాణ్యతపై తనిఖీకి కార్పొరేషన్‌లో గాని, మున్సిపాల్టీల్లో గాని ఏ విభాగం, మరే యంత్రాంగం లేదని స్పష్టం చేశారు. క్వాలిటీ కంట్రోల్‌ యూనిట్లు భవనాల నిర్మాణ అంశంపై లేకపోవడం వల్లే తామేమి చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు ఇంజనీర్లు బిల్డర్ల నుంచి సొమ్ములు తీసుకుంటూ మొక్కుబడిగా సమర్పించే నివేదిక వల్ల ఏ ఉపయోగం ఉండదని కార్పొరేషన్‌కు చెందిన మహేంద్ర అనే మరో అధికారి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి నిబంధనలు పరిశీలిస్తే ఒక భవనం నిర్మించాలంటే తొలుత భూసార పరీక్షతో పాటు సంబంధించిన ప్రాంతాల్లో పునాదుల నిర్మాణంపై అధ్యాయనం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత భవన నిర్మాణానికి వాడే ఇసుకతో పాటు సిమెంటు, చిప్స్‌ మిశ్రమం పాళ్లుపైనా ఖచ్చితమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. శ్లాబ్‌ నిర్మాణానికి ఎటువంటి ప్రమాణాలు పాటించాలో పరిశీలించాల్సి ఉంటుంది. కాంక్రీటు వేసేటప్పుడు సరైన ప్రమాణాల్లో ఫ్లైయాష్‌ను కూడా కలపాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుంచి ఖచ్చితంగా నిబంధనల మేరకు జారీ చేసే నిరభ్యంతర అనుమతి పత్రం విషయంలోను ఆసుపత్రులు, అపార్టుమెంట్లు అగ్నిప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకున్నాయా లేదా అన్న విషయాన్ని ఆ శాఖ అధికారులు గుర్తించి స్పందించాల్సి ఉంది. ప్రధానంగా అపార్టుమెంట్ల నిర్మాణంలో బిల్డర్లు త్వరితగతిన వేగంగా నిర్మాణం పూర్తి చేయడానికి పెట్టే దృష్టిని తగ్గించుకుని నాణ్యతపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీటన్నీటిని పట్టించుకోకుండా బిల్డర్లు అనుసరిస్తున్న వైఖరికి కార్పొరేషన్‌, మున్సిపల్‌ యంత్రాంగం అమ్మామ్యాలకు దాసోహమై వ్యవహరించడం వల్ల ప్రజలకే కష్టాలు దాపురిస్తున్నాయి. ప్రధానంగా అపార్టుమెంట్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తతో మెలగడం అవసరమని నిపుణులు అంటున్నారు. 'గొడ్డొచ్చి చేలో పడిన చందం'గా కాకుండా ప్రజలు అపార్టుమెంట్లలో ప్లాట్‌లు కొనుగోలు సమయంలో వాటి భద్రతపైనా నిపుణుల సలహాలు తీసుకుని స్పందిస్తే మేలని చెబుతున్నారు. అపార్టుమెంట్‌ కొనుగోలు దారులు దానిని కొనుగోలు చేసే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలూరు లోనే కాకుండా జిల్లాలో అపార్టుమెంట్ల నిర్మాణ తీరుపై విజులెన్స్‌ శాఖ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.


 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర