|
|
మొయిలీ వద్దు.. డిఎస్ ముద్దు..
సమన్వయ కమిటీపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి
హైదరాబాద్: పార్టీ రాష్ట్ర వ్యవహారాలు సమన్వయ పరిచేందుకు పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీకి న్యాయశాఖమంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్పమొయిలీని అధ్యక్షునిగా నియమించడం పట్ల తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. సీమాంధ్ర ప్రాంత నాయకులకు సానుకూలంగా వ్యవహారించే వీరప్పమొయిలీకి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేసారు. కమిటీకి ఈ ప్రాంతానికి చెందిన పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను అధ్యక్షునిగా నియమించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. హోంమంత్రి చిదంబరంపట్ల పలువురు నాయకులు అనవసరంగా ఆరోపణలు, విమర్శలు చేయడాన్ని సమావేశం తప్పుపట్టింది. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నందుకే ఆయనపై విమర్శలు చేస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది. డిఎస్‌ను అధ్యక్షునిగా నియమించకపోవడం తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టేనని దామోదర్‌రెడ్డి అభివర్ణించారు. డిఎస్‌ను సమన్వయ కమిటీ అధ్యక్షునిగా నియమించాలని పార్లమెంటు సభ్యుడు వివేక్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విజ్ఞప్తి చేసారు. మొయిలీ తెలంగాణ ప్రాంతం పట్ల వివక్ష కనబరుస్తున్నారని ఆరోపించారు. ఆయన రెండు ప్రాంతాలను సమానంగా చూడడం లేదని దామోదర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సాధించే వరకు ఎటువంటి ప్రయత్నలోపం లేకుండా నిరంతరం కృషి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, తదితర తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
|