|
|
ముస్లిం రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్...
ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: ముస్లింకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టువేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు సంచలన తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల కల్పనలో సరైన ప్రాతిపదికన లేదని ఏడుగురు సభ్యులతో కూడిన హైకోర్టు విస్తృత ధర్మాసనం పేర్కొంది. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని తెలిపింది. కేవలం ఆరు జిల్లాలలో మాత్రమే సర్వే చేశారని, కృష్ణన్ కమీషన్ నివేదిక ఆధారంగా రూపొందించిన అంశాల ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించారని పేర్కొంది. వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం తీర్పులో తెలిపింది. బీసీ కమీషన్ నివేదిక వాస్తవాలకు అనుగుణంగా లేదని యాంత్రికంగానే నివేదిక రూపొందించిందని పేర్కొన్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కులంకశంగా చర్చిస్తే బాగుండేదని పేర్కొంది.లోతు పాతులను క్షుణ్ణంగా పరిశీలించి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎఆర్ అనిల్‌దవే నేతృత్వంలో న్యాయమూర్తులు మీనాకుమారి, గోపాల్‌రెడ్డి, రఘురాం, ఈశ్వరయ్య, ప్రకాష్‌రావు, డిఎస్‌ఆర్ వర్మలతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది. దీనిలో అయిదుగురు న్యాయమూర్తులు రిజర్వేషన్ల కల్పనను వ్యతిరేకించగా డిఎస్‌ఆర్ వర్మ, ప్రకాశ్‌రావు అనుకూలంగా స్పందించారు. అయితే మెజార్టీ నిర్ణయం మేరకు హైకోర్టు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నది.
ముస్లింలకు విద్యాఉపాధి రంగాలలో 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రభుత్వం 2005లో నిర్ణయం తీసుకున్నారు. అయిదు శాతం రిజర్వేషన్లను అప్పట్లో కొట్టువేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అనంతరం రిజర్వేషన్‌లలో 4 శాతానికి కుదిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించింది. ఈ పిటిషన్‌లను సవాల్ చేస్తూ హైకోర్టులో కొందరు రిట్ దాఖలు చేశారు. సుధీర్ఘకాలం వాదోపవాదాలు జరిగిన అనంతరం 2009లో విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. 2007 నుంచి నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. తాజా తీర్పుతో ప్రభుత్వ నిర్ణయానికి చుక్కెదురైంది. తీర్పు పూర్తి పాఠాన్ని పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టులో అపీల్ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
విద్యార్థులకు నష్టం జరగనీయం: షబ్బీర్ ఆలీ
ముస్లిం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు సోమవారం ఇచ్చిన తాజా తీర్పు దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌ఆలీ చెప్పారు. ఈ తీర్పుపై దీనిపై తాను ముఖ్యమంత్రి రోశయ్యతో ప్రాథమికంగా చర్చించానని అడ్వకేట్ జనరల్‌తో కూడా సంప్రదించాలని ఆయన చెప్పారని షబ్బీర్‌ఆలీ తెలిపారు. హైకోర్టు తాజా తీర్పు పూర్తిపాఠాన్ని పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టులో అపీల్ చేస్తామని ఆయన చెప్పారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: ముస్లిం నేతలు
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ వర్గాలు చాలా వెనుకబడి ఉన్నందున వారికి రిజర్వేషన్లు కల్పించడం ఎంతైనా అవసరమని రిజర్వేషన్లు కొనసాగించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పలువురు ముస్లీం నేతలు పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనాత్మకమైందని అన్నారు. ముస్లింలకు ఈ తీర్పు శాపమని దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే మస్తాన్‌వలీ చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం బాధాకరమని ఎమ్మెల్సీ షేక్‌హుస్సేన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ముస్లింకు మతపరంగా రిజర్వేషన్లు కల్పించలేదని కేవలం వారి వెనుకబాటు తనాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ముస్లిం వర్గంలో అనేక ఉపకులాలు ఉన్నప్పటికీ సయ్యద్, పటాన్‌లు వంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించలేదని కేవలం 13 ఉప కులాల వారికి మాత్రమే రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. హైకోర్టు తీర్పుతో దాదాపు 38 వేల మంది లబ్దిదారులు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
|