|
|
రొయ్యల ధరలు ఆశాజనకం
ఒంగోలు: గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాకాలం ఆక్వాసాగు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వేసవికాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాకాలం సాగులో టైగర్ రొయ్య కేజీ ధర 310 నుండి 330 రూపాయల వరకు పలకటంతో రైతులు వేసవికాలంలో రెట్టింపు ఉత్సాహాంతో సాగుచేసేందుకు ఉపక్రమిస్తున్నారు. మన దేశ రొయ్యల దిగుమతిపై అమెరికా యాంటి డంపింగ్ డ్యూటీ విధించటంతో ఎక్కువ శాతం ప్రస్తుతం యూరోపియన్ దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. కాగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆక్వాసాగు గణనీయంగా తగ్గిపోవటంతో ధరలు పెరిగాయని మత్స్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నాయని నిబంధనలను పాటించకుండా సాగు చేస్తే మొదటికే మోసం వస్తుందని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 1993 సంవత్సరంలో నీలివిప్లవంలా ఆక్వాసాగు ఎగసిపడింది. ఆక్వాసాగు తొలినాళ్లలో టైగర్ రొయ్య కేజీ 600 నుండి 550 రూపాయల వరకు ధర పలికింది. టైగర్ రొయ్యల ధరలు ఆకాశాన్ని అంటడంతో పారిశ్రామికవేత్తలు, చిన్న సన్నకారు రైతులందరూ ఆ సాగువైపు మొగ్గుచూపారు. రానురాను రొయ్యల ధరలు పతానావస్థకు చేరటం, తెల్లమచ్చ వ్యాధులు విజృంభించటంతో ఆక్వాసాగు తగ్గిపోయింది. ఆక్వాసాగు తొలినాళ్ళలో జిల్లా వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో ఉంది. రాను రాను జిల్లాలో ఆ సాగు క్రమంగా తగ్గిపోయింది. జిల్లాలో ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రొయ్యపిల్లల ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి.
|
|
|