|
|
రిజర్వేషన్లు అందుకునేందుకు స్త్రీలు...
పెద్దసంఖ్యలో రాజకీయాల్లోకి రావాలి: మహిళాసత్తా
హైదరాబాద్: రొటేషన్ పద్ధతి వంటి కొన్ని తీవ్రలోపాలున్నప్పటికీ మహిళాబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం భారత రాజకీయాల్లో మేలుమార్పు దిశగా తొలిఅడుగు అని లోక్‌సత్తా పార్టీ మహిళావిభాగం 'మహిళాసత్తా' పేర్కొంది. బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం లోక్‌సత్తా ప్రధాన కార్యాలయంలో మహిళాసత్తా నేతలు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదానికి కృషి చేసిన నేతలను, పార్టీలను అభినందిస్తూ తీర్మానం చేయటంతోపాటు లోక్‌సభలో కూడా ఆమోదం పొంది చట్టం కావాలని ఆకాంక్షించారు. అన్నివర్గాలకూ, అందరి ఓట్లకూ ప్రాతినిధ్యం ఉండేలా ఎన్నికల వ్యవస్థలో భవిష్యత్తులో మార్పునకు ఆ చట్టం దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశానుద్దేశించి మహిళాసత్తా రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్. సరోజాదేవి మాట్లాడుతూ, కేవలం చట్టాల వల్ల మహిళల భాగస్వామ్యం పెరగదని, రాజకీయాల్లో పాల్గొని మార్పు తేవాలన్న ఆకాంక్షతో స్త్రీలు పెద్దసంఖ్యలో ముందుకు రావాలని అన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు లోక్‌సత్తా పార్టీ స్వచ్ఛందంగా 33శాతం సీట్లు కేటాయించినప్పటికీ పోటీకి పెద్దగా మహిళలు ముందుకురాలేదని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పోటీకి ముందుకు రాకపోతే పరిస్థితి పెద్దగా మారబోదన్నారు. మహిళలు ముందుకు రాకూడదనే సంప్రదాయ పార్టీలు రాజకీయాల్ని నేరమయంగా, జుగుప్సాకరంగా కొనసాగిస్తున్నాయని, వాటిని ద్వేషించకుండా మార్చుకునేందుకు భాగస్వాములవ్వటమే మార్పునకు ఏకైకమార్గమని అన్నారు. ఇందుకు రిజర్వేషన్లు మంచి అవకాశమన్నారు. అలాగే జనాభాలో సగభాగమున్న మహిళలకు కేవలం మూడోవంతుకాకుండా, పార్టీలు స్వచ్ఛందంగా సగంసీట్లు కేటాయించే రోజు రావాలని, లోక్‌సత్తా అందుకు పూర్తి సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళాసత్తా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. మహాలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు టి. పద్మజారాణి, గజానని, వై. రమణి, శ్రీదేవి, మంజులాదేవి, శైలజ, మాధవి, ఇందిర, విజయకుమారి, కల్పన, సుకన్య, కమలనాగమణి, మణిమంజరి, రామసుభద్ర తదితరులు పాల్గొన్నారు.
|
|
|