ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ పరిశీలిస్తున్న దృశ్యం

విశాఖపట్నం, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): హిందూస్థాన్‌ షిప్‌ యార్డు (హెచ్‌ఎస్ఎల్) ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ వినయ్‌‌చంద్‌ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్‌ ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్‌ సంస్థలు ఉన్నాయని చెప్పారు. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగులు కాగా మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు చెందినవారని పేర్కొన్నారు. క్రేన్‌ కుప్పకూలిన సమయంలో కేబిన్‌లో 10 మంది ఉన్నారని తెలిపారు. కేబిన్‌లో ఉన్న పదిమందితోపాటు మరొకరు మృతి చెందారని వివరించారు. మృతుల్లో 10మంది వివరాలను గుర్తించామని, మరొక మృతుడి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్‌ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్‌ఎస్ఎల్‌ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు.

విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ సామర్థ్యం పరీక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో పూర్తిగా ధ్వంసమైన పాత భారీ క్రేన్‌ స్థానంలో ఇటీవలే రూ.12 కోట్లతో కొత్త క్రేన్‌ను షిప్‌ యార్డు యాజమాన్యం కొనుగోలు చేసింది.

నిర్వహణ బాధ్యతలను పొరుగు సేవలకు అప్పగించింది. మృతుల్లో ప్రసాద్‌, జగన్‌ శాశ్వత ఉద్యోగులు కాగా మిగిలిన వారు పొరుగుసేవల కార్మికులు. ప్రమాద సమయంలో క్రేన్‌ కేబిన్‌లో 15 మంది ఉన్నట్లు అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ఘటనాస్థలం వద్ద కార్మికుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల వివరాలు తెలియక హెస్‌ఎస్‌ఎల్‌ ప్రధాన ద్వారం వద్ద బంధువులు ఆవేదన పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here