కడప, జులై 25 (న్యూస్‌టైమ్): నమ్మిన వ్యక్తులకు పార్టీ, సీఎం జగన్ అండగా నిలుస్తారనడానికి మైనారిటీ నాయకులు ఫయాజుర్ రెహమాన్‌కు అందిన ఆర్థిక సహాయమే నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.27.55 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఫయాజుర్ రెహమాన్ అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, లివర్ మార్పిడి కోసం ఆసుపత్రుల ఖర్చుల కోసం లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను తెగనమ్ముకున్నారన్నారు. ఆసుపత్రులకు చెల్లించిన డబ్బుల కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం గత ప్రభుత్వాలుకు విన్నవించుకుంటే పార్టీ వ్యక్తి కాదని, పార్టీ మారితే సహాయం చేస్తామని చెప్పినా పార్టీని వదలలేదన్నారు. అంతటి ఇబ్బందుల్లో కూడా రెండు పర్యాయాలు పార్టీ పరంగా కౌన్సిలర్‌గా గెలుపొందారన్నారు.

ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి వివరించామన్నారు. ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా పార్టీకి వెన్నంటి ఉండిన ఫయాజుర్ రెహమాన్‌కు వైద్యపు ఖర్చు నిమిత్తం రూ 20 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారన్నారు. శనివారం శ్రీకాంత్ రెడ్డి ఆ చెక్కును ఫయాజుర్ రెహమాన్‌కు అందచేశారు. ఈ సందర్భంగా ఫయాజుర్ రెహమాన్ మాట్లాడుతూ తన విన్నపాన్ని మన్నించి నియోజక వర్గ పరిధిలో ఇంతవరకు ఎవ్వరికీ అందనంత సహాయాన్ని అందించి ఆదుకున్న సీఎం జగన్,ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నామన్నారు.

అనంతరం సంబేపల్లె మండలం దుద్యాల కు చెందిన శెట్టిపల్లె జయరామి రెడ్డికి రూ.5.30 లక్షలు, పట్టణానికి చెందిన కూరగాయల మహబూబ్ బాషాకు రూ.2.25 లక్షలు చెక్కులను శ్రీకాంత్ రెడ్డి అందచేశారు. అలాగే, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ మునిసిపల్ పరిధిలో లబ్దిదారులయిన 7 కుటుంబాలకు 5వ రోజు అక్షరాలా లక్షా అరవై వేల రూపాయల (1,60,000/-) ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. భగత్‌సింగ్ నగర్, గాంధీనగర్, విజయనగర్ కాలనీ, శ్రీనివాసపురంలో చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా చింతల వెంకటరమణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మునుపు ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రి నియోజకవర్గంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఘనత కేతిరెడ్డి పెద్దారెడ్డిదే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ఈ సహాయ కార్యక్రమంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని సీఎం ఫండ్ ద్వారా లబ్ది పొందిన కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాధితులకు నగదు అందజేయడానికి తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న కృషికి లబ్ధిదారులు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ కంచెం రామ్‌మోహన్ రెడ్డి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు గయాజ్ బాషా (మున్నా), బాణా నాగేశ్వర్ రెడ్డి, టౌన్ యూత్ అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి, మైనారిటీ పట్టణాధ్యక్షుడు అన్వర్ బాషా, విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షుడు కాశీ మనోజ్, మొయినుద్దీన్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.