ఒడిశా పరిధిలో శరవేగంగా సాగుతున్న రైల్వే నిర్వహణ పనులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద భారతీయ రైల్వే 6 రాష్ట్రాల్లో (బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) 5.5 లక్షలకు పైగా పనిదినాలను ఉత్పత్తి చేసింది. ఈ ప్రాజెక్టులలో సాధించిన పురోగతి గురించీ, ఈ పథకం కింద ఈ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు కల్పిస్తున్న పని అవకాశాల గురించీ, కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల మంత్రి పియూష్ గోయల్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో 2,988 కోట్ల రూపాయల విలువైన 165 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. ఈ అభియాన్‌లో, 2020 ఆగష్టు, 14వ తేదీ వరకు 11,296 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు. అమలులో ఉన్న ప్రాజెక్టుల కోసం 1,336.84 కోట్లరూపాయల మేర చెల్లింపులను కాంట్రాక్టర్లకు విడుదల చేశారు. ప్రతి జిల్లాలో, రాష్ట్రాలలో రైల్వే శాఖ నోడల్ అధికారులను నియమించింది.

తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది. వలసదారులను నిర్ధారించి, ప్రాజెక్టులలో నిమగ్నం చేసి, తదనుగుణంగా చెల్లించడానికి గాను, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సంబంధిత జోనల్ స్థాయిలో రైల్వే పరిపాలనా అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద అమలు చేయడం కోసం రైల్వే శాఖ అనేక రైల్వే పనులను గుర్తించింది. వీటిలో, లెవల్ క్రాసింగ్‌ల కోసం అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నిర్వహణ; రైలు మార్గం వెంట సిల్టెడ్ జలమార్గాలు, కందకాలు, కాలువల అభివృద్ధి, శుభ్రపరచడం; రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నిర్వహణ; ఇప్పటికే ఉన్న రైల్వే కట్టలు/కోతల మరమ్మతులు, వెడల్పు; రైల్వే భూముల్లోనూ, సరిహద్దుల్లోనూ చెట్ల పెంపకం; ఇప్పటికే ఉన్న కట్టలు/కోత/వంతెనల రక్షణ పనులకు సంబంధించిన పనులు ఉన్నాయి. వినాశకరమైన కోవిడ్-19 చేత ప్రభావితమై పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చిన ప్రాంతాలు/గ్రామాలలో జీవనోపాధి అవకాశాలను శక్తివంతం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ అనే భారీ ఉపాధి, గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమాన్ని 2020 జూన్ 20వ తేదీన ప్రారంభించారు.

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. 125 రోజుల పాటు కొనసాగే ఈ అభియాన్, మిషన్ మోడ్‌లో చేపడుతున్నారు. 116 జిల్లాల్లో 25 రకాల పనులు/కార్యకలాపాలను కేంద్రీకరించడం జరిగింది. 6 రాష్ట్రాల్లో (బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశాలోని) తిరిగి వచ్చిన వలస కార్మికులు అధికంగా ఉన్నారు. ఈ అభియాన్‌లో భాగంగా 50,000 కోట్ల రూపాయల మేర ప్రజా పనులు జరుగుతున్నాయి. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు/విభాగాల మధ్య సమన్వయంతో పనిచేస్తోంది.

అవి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్; రోడ్డు రవాణా, రహదారులు, గనులు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం, సహజ వాయువు, నూతన, పునరుత్పాదక విద్యుత్తు, సరిహద్దు రోడ్లు, టెలికాం, వ్యవసాయం. ఈ మంత్రిత్వ శాఖలు/విభాగాలలో 25 ప్రజా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికి, జీవనోపాధి అవకాశాల వృద్ధికి సంబంధించిన పనులు చేపట్టడానికి, ఈ అభియాన్ ద్వారా కృషి జరుగుతోంది.