భారత్‌లో 562కు పెరిగిన కరోనా కేసులు

95

న్యూఢిల్లీ, మార్చి 25 (న్యూస్‌టైమ్): ఊహించినట్లుగానే కరోనావైరస్ (కొవిడ్-19) మహమ్మారి భారత్‌లో కురులువిప్పుతోంది. నిన్నటికి దేశవ్యాప్తంగా 500 ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కరోజులోనే 62 పెరిగి 562కు చేరుకుంది. వీరిలో 41 మంది కోలుకోగా 9 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తాజాగా తమిళనాడులో కొవిడ్‌-19తో మరొకరు మృతిచెందారు. అయితే, ఈ మరణాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 512 మంది కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 43 మంది విదేశీయులే ఉన్నారు.

ఇక, కేరళలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 109కి చేరింది. వీరిలో ఇప్పటివరకు నలుగురు కోలుకున్నారు. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య తాజాగా 101కి చేరుకోగా ఇద్దరు మరణించారు. కర్ణాటకలో కూడా తాజాగా ఈ కేసుల సంఖ్య 41కి చేరింది. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 10 మంది కొవిడ్‌-19తో మరణించినట్లు వార్తలు వచ్చాయి. తొలుత ఢిల్లీలో కొవిడ్‌-19తో ఇద్దరు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అయితే, కరోనా లక్షణాలతో మరణించిన రెండో వ్యక్తికి కొవిడ్‌-19 నిర్థారణ కాలేదని అనంతరం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణాల సంఖ్య మంగళవారం నాటికి 9గా ఉన్నట్లు పేర్కొంది.

వీరిలో మహారాష్ట్రలో ఇద్దరు మరణించగా బిహార్‌, ఢిల్లీ, గుజరాత్‌, హిమాచల్‌‌ప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం ఉదయం తమిళనాడులో కొవిడ్‌-19 కారణంగా ఓవ్యక్తి మరణించినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు. అయితే దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇలాంటి విపత్కర సమయంలో దేశంలో ఆహార కొరత, కరోనాపై పుకార్లు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

ఈ సమయంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకూడదని కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఐటీ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది. కరోనా వైరస్‌ పరిస్థితులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్నదేశవ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు వారణాసి ప్రజలతో టెలికాన్ఫరెన్స్‌లో ముఖాముఖిగా మాట్లాడారు. కాగా, దేశంలో కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు.

లాక్‌డౌన్‌ తప్పసరి చర్య అని చెప్పారు. ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జావడేకర్‌ మాట్లాడారు. ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటిస్తారనే నమ్మకముందన్నారు. పాలు, నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయం వరకు తెరిచే ఉంటాయని జావడేకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని చెప్పారు.

రూ.2కే కిలో గోధుమలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వైద్యులు, పాత్రికేయులు, మీడియా సిబ్బంది ప్రజాసేవ చేస్తున్నారని జావడేకర్‌ చెప్పారు. ఒప్పంద ఉద్యోగులతో పాటు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని, దీనికి ప్రజలంతా మద్దతుగా నిలిచి వైరస్‌ నిరోధానికి కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సూచనలను అందరూ పాటించాలని జావడేకర్‌ కోరారు.