వామ్మో… అన్ని కోట్ల ఖర్చా?

0
12 వీక్షకులు

‘‘లక్ష కోట్లు ఖర్చుఅవుతోంది అందుకే అమరావతిని మార్చేస్తునాం’’ అని పదే పదే తన మంత్రివర్గ సహచరులతో ప్రెస్‌మీట్లు పెట్టించి. పక్కదోవ పట్టిస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగస్తులు రారేమో అని వారికీ ఎన్నో తాయిలాలు ప్రకటించి వారికీ ఎలా ఎర వేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

ఆ ఖర్చులన్నీ కలిపితే లక్ష కోట్లేం ఖర్మ రెండింతలు దాటిపోయాయే పరిస్థితి కనిపిస్తోందని జాతీయ మీడియా గొంతెత్తి హెచ్చరిస్తోంది. రాజధాని కేవలం ఉద్యోగుల కోసం మాత్రమేనా? లక్ష కోట్లని ఏడిచారు? మరి ఈ డబ్బు ఎక్కణ్ణుంచి తెస్తారు? వంటి ప్రశ్నలూ విపక్షాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.

ప్రఖ్యాత జాతీయ ఆంగ్ల పత్రిక ‘హిందుస్తాన్ టైమ్స్’ తన సొంత వెబ్‌సైట్‌లో సరిగ్గా పది రోజుల కిందట పోస్టు చేసిన ఐటెమ్‌ను అనువరించి చదివే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది.

పరిపాలనా విభాగాన్ని అమరావతి నుండి విశాఖపట్నానికి మార్చడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ కొత్త రాజధానికి వెళ్లడానికి దాదాపు నాలుగు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందించాలని సూచించింది.

గత శుక్రవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో చర్చించిన ముసాయిదా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, ఉద్యోగులందరికీ వారు మారడానికి ముందే విశాఖపట్నం వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు కేటాయించేందుకు నిర్ణయించారు.

అనుమతి పొందిన డిజైన్లతో కొత్త ఇళ్ల నిర్మాణానికి, రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా మినహాయింపు ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బీఏ) ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రాధమికంగా అంగీకారం కూడా తెలిపింది.

ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ప్రకారం అవివివాహితులకు (బ్యాచిలర్లకు) అద్దె రహిత వసతి లభిస్తుంది. కుటుంబాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లలో నెలకు 4,000 రూపాయల సబ్సిడీ అద్దెకు వసతి కల్పిస్తారు. ఉన్నత అధికారులకు మూడు పడకలతో కూడిన ఫ్లాట్లలో 6,000 రూపాయల చొప్పున వసతి కల్పిస్తారు.

ఉద్యోగులకు క్లాస్-4 ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గెజిటెడ్ ఉద్యోగులకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం లభిస్తుంది. మరో మూడేళ్లపాటు ఉద్యోగులకు ఐదు రోజుల వారపు సదుపాయాన్ని కొనసాగించాలని కమిటీ సిఫారసు చేయగా, విశాఖపట్నంలో సబ్సిడీ రవాణా సదుపాయాన్ని కొనసాగించాలని హై-పవర్ కమిటీ ప్రతిపాదించింది. ఈ మేరకు విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని వారి స్వస్తలానికి ప్రభుత్వం విస్తరించనుంది.

ఇంత వరకూ బాగానే ఉంది. కాకపోతే, ఎంత ఖర్చు అవుతుందో సుమారు అంచనా వేసేవాళ్లకు మతిపోయే పరిస్థితి ఎదురవుతోంది. మొత్తం ఉద్యోగులు 4 లక్షల మంది అయితే, ఒక్కొక్కరికి 200 గజాల వంతున ప్లాట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం విశాఖలో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. అంటే 4,00,000x200x21,000=168000,00,00,000.

అంటే, కేవలం ఇంటి ప్లాట్ల కోసమే సుమారుగా 168000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. విభజన అనంతరం ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంతటి ఆర్ధిక భారాన్ని మోయడం ఎలా సాధ్యం? ఒకవేళ ఎంత దూరంగా ఇచ్చినా రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు.
పోనీ, గజం 5,000 లెక్కన తీసుకుంటే 4,00,000x200x5000=40000,00,00,000 అంటే అక్షరాలా 40,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన ఆవశ్యకత ఉంది.

ఇక రెండో అంశానికి వస్తే, ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యాన్ని ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనను, హై పవర్ కమిటీ సూచననూ పరిగణనలోకి తీసుకుంటే? 4,00,000×25,00,000=100000,00,00,000 అంటే దాదాపు 1 లక్ష కోట్లు
అలవెన్సు అంటే జీతంలో భాగంగా అని భావించాలి కనుక.

అలాగే, ఇళ్ళు పూర్తి అయ్యేవరకు ఉద్యోగుల అద్దె భారం ఎలా పడుతుందో పరిశీలిస్తే… 4 లక్షల మందిలో సుమారుగా 50,000 ఒంటరి వాళ్ళు, 2,50,000 మంది 2 బెడ్ అర్హత వాళ్ళు, 1,00,000 మంది 3 బెడ్ అర్హత వాళ్ళు ఉన్నట్లు ప్రాధమిక అంచనా. నిర్మాణ వ్యవధి 12 నెలలు అనుకుంటే… ఒంటరి వాళ్ళకు ఫ్రీ అంటే అద్దె మొత్తం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఆ విధంగా లెక్కేస్తే… 50,000x12x3,000 (అతి తక్కువ అద్దె అనుకుంటే) 180,00,00,000=180 కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటుంది.

రెండు బెడ్ రూమ్స్ వాళ్ళు… 2.5 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తే… వీరు సుమారు 10,000 అద్దె ఇంటిలో ఉంటే 4000 రూపాయలు వాళ్ళు, 6000 రూపాయలను ప్రభుత్వం భరించాల్సి వుంటుంది. ఆ విధంగా చేస్తే… 2,50,000 x12x6,000=1800,00,00,000 అంటే 1800 కోట్ల రూపాయలు వెచ్చించాలి.

ఇక, త్రిబుల్ బెడ్ రూమ్ అర్హత వున్న వారు సుమారు 15,000 అద్దెలో ఉంటారనుకుందాం, అపుడు 6,000 రూపాయలను వాళ్ళు, 9,000 రూపాయలను ప్రభుత్వం భరించాల్సి వుంటుంది. అలా చూస్తే, 1,00,000x12x9000=1080,00,00,000=1,080 కోట్ల ఖర్చు. వెరసి మొత్తం ప్రభుత్వం భరించావలసిన భారం అక్షరాలా 3,060 (180+1800+1080=3,060) కోట్ల రూపాయలన్నమాట.

చివరిగా షిఫ్టింగు భత్యం 50,000 లేదా 1 లక్ష రూపాయల చెల్లింపు విషయానికి వస్తే… ఏ కేటగిరీ వాళ్ళెంతమందో తెలియదు కనుక సగటుగా 75,000 అనుకుంటే… 4,00,000×75,000=3000,00,00,000=3000 కోట్లు.

దీన్ని బట్టి ఆలోచిస్తే ఇది అసలు ఎలా సాధ్యం. ఉద్యోగులకు ఇచ్చేవే ఇంత వుంటే మిగతా ఖర్చు ఎంత వుంటుంది? ఇదంతా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిందే కదా? ఇలా పన్నుల చెల్లింపుదారుల ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం?

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకోవడం కంటే అత్యుత్తమ ఆశయం, నిర్ణయం మరొకటి ఉండదు. అలాగని, అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరైనది కాదేమో అన్న కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తే మంచిది.

ఇప్పటికే హైదరాబాద్‌ను వీడి కట్టుబట్టలతో అమరావతి వచ్చిన ఉద్యోగులు ఉన్నట్టుండి విశాఖపట్నానికి వెళ్లడానికి సిద్దంగా ఉన్నారా? లేదా? అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ‘విషయం వీక్‌గా ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటుంది’ అన్న ఓ సినీ కవి మాటల్ని గుర్తుచేసుకుని అధికార, విపక్షాలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషిచేయాల్సి ఉంది.

అంతేగానీ, గత ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ఎంపిక చేసింది కాబట్టి ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభివృద్థి వికేంద్రీకరణ పేరిట ఇష్టారాజ్యంగా రాజధానులను ఏర్పాటుచేయాలనుకోవడం సరైనది అవునో కాదో శాసనకర్తలే నిర్ణయించాలి.

అసలు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్ర జోక్యం ఏ మాత్రం అవసరం లేదా? అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వైసీపీ సర్కారు నేడు అమలుచేస్తున్న నిర్ణయాన్ని ఇది వరకే జగన్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారా? అక్కడి నరేంద్రమోదీ ప్రభుత్వం దానికి కనీసం మాటసాయంగానైనా అనుమతించిందా? అన్నదీ ప్రశ్నార్ధకంగానే మిగిలింది.

కేంద్రంలోని అధికార భాజపాకు చెందిన రాష్ట్రంలోని నాయకులెవరూ వైసీపీ నిర్ణయాన్ని పెద్దగా వ్యతిరేకించకపోవడాన్ని బట్టి చేస్తుంటే జగన్ సర్కారు నిర్ణయానికి మోదీ సర్కారు లోపాయికారీ అంగీకారం తెలిపిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడి ప్రధాన ప్రతిపక్షానికి పెద్దగా సీట్లు రాలేదన్న కారణంతో ఆ పార్టీకి ప్రభుత్వ నిర్ణయాలలో అంతగా విలువ ఇవ్వకపోవచ్చు గానీ, కేంద్రానికి తుది సమాధానం అంటూ చెప్పాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని వైసీపీ సర్కారు పెద్దలు మరిచారా? అన్న ప్రశ్న మేథావి వర్గం నుంచీ వ్యక్తం అవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ మాత్రమే కాదు, చివరిగా రాష్ట్రపతి కూడా ఆమోదించాల్సి ఉంటుందన్న విషయాన్ని జగన్ సర్కారు అయితే మరచి ఉండదనే భావించాలి. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా మీడియా స్వాగతించాల్సిందే… లేదంటే లేనిపోని తలనొప్పులు.

అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా, అక్కడ ఖర్చుపెడుతున్నది ప్రజల ధనమే. ఆ విషయాన్ని ఎవరూ మరువరాదు. కేవలం రాజకీయ కారణాలతో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రాజధానులను ఏర్పాటుచేసుకున్నారన్న అపవాదును అఖండ భారతావణిలో ఆంధ్రప్రదేశ్‌కు మిగల్చరాదన్న ఏకైక లక్ష్యాన్ని మననంలో పెట్టుకుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here