‘జనసేన’ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ సర్కారు కక్షసాధింపునకు దిగిందా? ఇన్నాళ్లూ ఇష్టారాజ్యంగా అన్ని చిత్రాలకూ అదనపు ధరలు అనుమతించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నట్టుండి ఇప్పుడు ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్న విషయం గుర్తుకువచ్చిందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న టికెట్ ధరల నియంత్రణ నిర్ణయం రాజకీయంగా దుమారం లేపుతోంది.

ఇంతవరకూ సినిమా టికెట్ ధరలను హైకోర్టు పేరు చెప్పి తమ ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ వస్తున్న నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్‌‌లో చెంపచెల్లుమనేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఏ సినిమాకైనా, ఏ రోజైనా టికెట్ ధర ఒకేలా ఉంటుందని, పెంచుకోడానికి వీలు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత మీడియా సంస్థకు చెందిన ‘సాక్షి’ పత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న ఉత్సాహం చాలా మంది అభిమానుల్లో ఉంటుంది. ఈ అభిమానాన్ని వీలున్నంత వరకు ‘క్యాష్‌’ చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది.

ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమేంటన్నది అభిమానుల ఆక్రోశం కూడా. ఎవరి సినిమా అయినా ఏ రోజైనా, టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులో, వారమో, రెండు వారాలో టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని, తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసిందని ‘సాక్షి’ కథనం స్పష్టంచేసింది.

అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించిందని, ఇవి అన్ని సినిమాలకూ అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చిందని కథనంలో రాశారు. తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అని ‘సాక్షి’ వివరించింది. మొత్తానికి ‘వకీల్ సాబ్’ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డివివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ‘వకీల్‌ సాబ్‌’ సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతించాలంటూ గత నెల (మార్చి) 25వ తేదీన థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి వినతిని మన్నించిన హైకోర్టు టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. అయితే టికెట్ ధరల పెంపును ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ‘వకీల్‌సాబ్‌’ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

వకీల్‌ సాబ్‌ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 9న) ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్‌లో రిలీజ్ అయ్యింది. పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. హిందీ ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా యూఎస్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్‌ పడ్డాయి.