పోలీసుల అధ్వర్యాన రక్తదాన శిబిరం

66

నెల్లూరు, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): సింహపురి జిల్లా వెంకటాచలం మండల పోలీసు అధికారులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను కొనియాడారు.

దేశ భద్రతకోసం, మన ప్రాణ రక్షణకోసం వీరోచితంగా పోరాడి అసువులు బాసిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘మనం శాంతియుతంగా ఉండడానికి, ఎన్నో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించు కోవాలి. ప్రాణాలను లెక్కచేయకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ మన దేశ భద్రతకోసం నిరంతరం కాపలాగా ఉంటున్నారు. అటువంటి వారికి సమాజం కూడా అండగా ఉండాలి’’ అని కాకాణి పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని వారం రోజుల పాటు ప్రజలు భాగస్వామ్యంగా నిర్వహించే విధంగా ఉండాలన్నారు.

‘‘అందరి మాన, ప్రాణాలను కాపాడుతున్న వారు పోలీసులు. మనం ప్రశాంతంగా ఉండేందుకు పోలీసుల ప్రాణాలను కూడా త్యాగాలు చేస్తున్నారు. ఇతర దేశాలతో మనకు ముప్పు ఉన్నా మంచు కొండల్లో ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాస్తుంటే, మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాము’’ అని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం, వెంకటాచలం సీఐ రామకృష్ణ, ఎస్.ఐ. కరిముల్లా ప్రజల కోసం కష్ట పడుతున్నారని మెచ్చుకున్నారు.