పకడ్బంధీగా గ్రామ వాలంటీర్ల ఎంపిక

100
  • విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం

  • మరింత మెరుగ్గా ప్రభుత్వ వైద్యసేవలు: కలెక్టర్

చిత్తూరు, జులై 13 (న్యూస్‌టైమ్): గ్రామ వాలంటీర్ల ఎంపిక కార్యక్రమాన్ని పకద్భంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయనవనం, నాగలాపురం ఎంపిడిఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి గ్రామ వాలంటీర్ల ఎంపిక కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఇంటర్వ్యూలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల ఎంపిక కార్యక్రమంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, అభ్యర్థుల అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి సమస్యలు లేకుండా కెటగిరీల వారీగా అభ్యర్థుల ఎంపిక జరగాలని తెలిపారు. అనంతరం పిచ్చాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి పిల్లలకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ కూడా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేసి పాఠశాల ఆవరణంలో గల తరగతి గదులను పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఉన్నత పాఠశాలలో శానిటేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, పాత మరుగుదొడ్లు, నీళ్ల ట్యాంకును పరిశీలించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న పాఠశాల ప్రహరీ గోడను వెంటనే పూర్తి చేయాలని తరగతి గదుల్లో కొన్ని డెస్క్‌లు రిపైర్‌లు కలిగి ఉండడం, లైట్‌లు లేకపోవడం గమనించి వాటికి వెంటనే మరమత్తులు చేయాలని కొత్త మరుగుదొడ్ల నిర్మాణానికి ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని హెచ్ఎం యుగంధర్ రాజును కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అక్కడ ప్రజలకు అందించే వైద్య సేవలపై, అత్యవసర మందుల నిల్వలు, ఆసుపత్రిలో గల ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు. వైద్య సమస్యలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్‌లకు సరైన సమయంలో వైద్య సేవలు అందించాలని, అందుకు అనుగుణంగా డాక్టర్లు సమయపాలన పాటించాలన్నారు.

మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులకు అనుగుణంగా మందుల స్టాక్ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, రికార్డుల నిర్వహణలో ఎటువంటి తేడాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట నాగలాపురం మెడికల్ ఆఫీసర్ గుణ శేఖర్, డాక్టర్ అనిత, ఇతర సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో నారాయనవనం ఎంపిడిఓ భవానీ, నాగలాపురం ఎంపిడిఓ శోభన్ బాబు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.