Home Devotional & Culture లేని వజ్రంపై దుమారం?

లేని వజ్రంపై దుమారం?

0
495 Views

టీటీడీలో చంద్రిక వజ్ర… రహస్యం!

పరువు నష్టం దావా కేసులో వెనక్కి!

దేవస్థానం ఖజానాకు రూ. 2 కోట్ల నష్టం

తిరుపతి, అమరావతి, అక్టోబర్ 30 (న్యూస్‌టైమ్): తిరుమలేశుని ఆభరణాలలో భాగమని చెబుతున్న పింక్‌ డైమండ్‌ వ్యవహారం నేటికీ అంతుచిక్కనిదిగానే మిగిలిపోయింది. నాడు రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుచేసి రూ.200 కోట్లకు వేసిన పరువు నష్టం కేసును పాలకమండలి మారగానే ఉపసంహరణకు చర్యలు చేపట్టడంతోనే ఈ ప్రచారం కేవలం బూటకమని తేలిపోయింది. మరోవైపు, టీటీడీ ఉన్నతాధికారులే అసలు లేని వజ్రం గురించి చెప్పమంటే ఎలా? అంటూ ఎదురు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో అసలు చంద్రిక వజ్ర రహస్యం ఏమిటన్నది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అప్పట్లో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై తితిదే అధికారులు రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. దాని కోసం ముందస్తుగా రూ. 2 కోట్ల ధరావతును కూడా న్యాయస్థానంలో చెల్లించారు. అది ఇంకా కోర్టులో తేలకముందే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. దావా వేసినప్పటి ఈవోనే ఆ తర్వాతా కొనసాగారు. కానీ, దేవస్థానం పరువుకు నష్టం కలగలేదనుకున్నారో ఏమో.. దావా ఉపసంహరించుకుంటామని చెప్పారు. అందుకోసం తాము ముందుగా చెల్లించిన రూ. 2కోట్ల ధరావతును వదులుకోడానికీ సిద్ధపడ్డారు!

ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గతంలో తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధానార్చకులుగా ఉన్న ఏవీ రమణదీక్షితులు ఆలయంలో పింక్‌ డైమండ్‌ మాయమైందని ఆరోపిస్తూ తితిదే తీరును అప్పట్లో తప్పుబట్టారు. ఇదే అంశంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి తితిదే ఛైర్మన్‌, నాటి నుంచి ఇటీవలి వరకూ ఈవోగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దీనిపై గట్టిగా స్పందించారు. తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ 2018లో ఒక్కొక్కరిపై రూ.100 కోట్ల చొప్పున రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం న్యాయస్థానంలో రూ. 2 కోట్ల ధరావతు చెల్లించారు.

అయితే, రాష్ట్రంలో సర్కారు మారడంతో కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. రమణ దీక్షితులును ఆగమ సలహామండలి సలహాదారుగా నియమించారు. ఈ సమయంలోనే గతంలో తితిదే వేసిన పరువునష్టం దావా విషయాన్ని కొత్త ఛైర్మన్‌ వద్ద ప్రస్తావించగా, తాము దాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. దావాను విరమించుకుంటున్నట్లు తిరుపతిలోని జిల్లా కోర్టులో తాజాగా తితిదే తరఫున పిటిషన్‌ వేశారు. చెల్లించిన రూ.2 కోట్లనూ వదులుకుంటామన్నారు. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.

తితిదే కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్లను ధర్మకర్తల మండలి సభ్యుల నుంచి వసూలు చేయాలని ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇక, తితిదే చేసిన తీర్మానం విషయానికి వస్తే…

తితిదే దాఖలుచేసిన పరువునష్టం దావా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 29న ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఇందులోని అంశాలు ‘‘తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించారని పేర్కొంటూ 2018 జూన్‌ 6న చేసిన తీర్మానాన్ని అనుసరించి తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై తలో రూ.100 కోట్లకు తిరుపతిలోని మూడో అదనపు న్యాయస్థానంలో దావా దాఖలు చేశారు. దీనిపై నోటీసులు జారీ చేయగా వారిద్దరూ సమాధానం ఇచ్చారు. తాము ఎన్నడూ తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించలేదని తెలిపారు. తమకు స్వామిపై నమ్మకం ఉందని, తమపై వేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. తితిదేకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని వారు పేర్కొన్నందున దావాను ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. దీనికి అనుగుణంగా తితిదే న్యాయవిభాగం అధికారి కోర్టులో దాఖలు చేసిన దావాను ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ తీర్మానించారు.’’

అయితే, ఆనాడు ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన విధంగా డైమాండ్ ఉందా? లేదా? అనే విషయం ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజకీయ వత్తిడి నేపథ్యంలోనే తితిదే కేసు వెనక్కి తీసుకుందా? ఆరోపణలు చేసిన వారు ఏమి సాధించినట్లు? అంటే రాజకీయాల కోసం స్వామి వారిని అబాసుపాలు చేయడం ఎంత వరకు సబబు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని డైమాండ్ విషయంలో కోర్టులు నుండి తప్పించుకోవచ్చునేమో గాని ఆ స్వామి కోర్టు నుండి తప్పించుకోలేరు!

ఇదిలావుండగా, తిరుమల ఆలయంలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు వేచి చూస్తున్న మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఇంకా డోలాయమాన స్థితిలోనే ఉన్నారు. వయసు మీదపడిందన్న కారణంతో పదవీ విరమణ చేసి ఆలయ ప్రధాన అర్చకత్వానికి దూరమయ్యారు. టీటీడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనానికి తెర తీశారు. టీటీడీలోని అక్రమాల్లో టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ అప్పట్లో అతనికి మద్దతు పలికింది కూడా. దీనితో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రమణ దీక్షితులు తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారని భావించారంతా. ఎన్నికలకు ముందు జగన్‌ను హైదరాబాద్‌లో రమణ దీక్షితులు కలిసారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వచ్చినప్పుడు జగన్‌ను కలుసుకొని పట్టు వస్త్రం కప్పి సత్కరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రమణ దీక్షితులు ఇక మరోమారు ఆలయంలోకి వచ్చినట్టే అని అంతా అనుకున్నారు. టీటీడీ కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే దీనికి సంబంధించిన తీర్మానం చేస్తారనే వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది.

కాకపోతే, పాలక మండలి ఎన్ని సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ మధ్య అర్చకుల వారసత్వ హక్కులను సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన చూసినవారంతా రమణ దీక్షితులుకు లైన్ క్లియర్ అయ్యిందనుకున్నారు. అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే, ప్రభుత్వం ఈ ప్రకటనలో చిన్న మెలిక పెట్టింది. టీటీడీ మినహా మిగితా అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మరోసారి నిరాశకు గురవ్వాల్సి వచ్చింది రమణ దీక్షితులు. గతంలో జరిగిన ఒక ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రమణ దీక్షితులు మనసులో ఆశలు రేకెత్తించినట్టే రేకెత్తించి మళ్లీ నీళ్లు చల్లేసినట్టయింది. టీటీడీలో పదవీ విరమణ పొందిన అర్చకులను మల్లి తీసుకుంటామని అన్నారు.

కాకపోతే, ప్రధాన అర్చకులుగా తీసుకోలేమని, ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులకు స్థాన చలనం ఉండబోదని అన్నారు. ఇక, శ్రీవారి విలువైన వజ్రమేమైందని ప్రశ్నిస్తూ దేశమంతా తిరుగుతూ, ఢిల్లీతో సహా అనేక నగరాల్లో ప్రెస్ మీట్లు పెడుతూ తీవ్ర ఆరోపణలు చేసారు అప్పట్లో. కేంద్రమంత్రులను కలుస్తూ గత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. రమణ దీక్షితులు తిరిగి తీసుకుంటే రమణ దీక్షితులు ఆరోపణలను ఒప్పుకున్నట్టవుతుందని పాలక మండలి భావించి ఉండాలి. అంతే కాకుండా వాటిపైనా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులును తీసుకోవడానికి జగన్ సర్కార్ తటపటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు, ఆసక్తిదాయకమైన అంశమేమిటంటే… టీటీడీ రికార్డుల్లో ఎక్కడా పింక్ డైమండ్ గురించి లేదని, రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? అంటూ నాటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తను పదవిలో ఉన్నప్పుడు ప్రశ్నించారు. టీటీడీ వివాదం నేపథ్యంలో ఛైర్మన్‌తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆయన సీఎంతో సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాదం నేపథ్యంలో అన్ని విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వెల్లడించినట్లు సింఘాల్ తెలిపారు. తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు పదే పదే సూచించారని ఈవో అశోక్ సింఘాల్ చెప్పారు. 1952 నుంచి శ్రీవారి ఆభరణాల రికార్డులు ఉన్నాయని తమ వద్ద ఉన్నాయన్నారు.

శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చిన విషయాన్ని ఈవో ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాలు ఏవో ఆ కమిటీ తేల్చలేకపోయిందని ఈవో సింఘాల్ చెప్పారు. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతుందని, ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా ఆ విషయం రికార్డుల్లోకి వస్తుందని ఈవో వెల్లడించారు. గరుడసేవలో వచ్చింది పింక్‌ డైమండ్‌ కాదని, కెంపు మాత్రమేనని సింఘాల్ స్పష్టం చేశారు. ఒప్పుకుంటే ప్రదర్శన భక్తులు విసిరిన నాణేలకు కెంపు పగిలిపోయిందని, అప్పటి ఈవో ఐవైఆర్‌ కెంపు పగిలిపోయిందని నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ గుర్తు చేశారు.

శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చామని, ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలను ప్రదర్శిస్తామని ఈవో సింఘాల్ స్పష్టం చేశారు. శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ తాము సక్రమంగా వినియోగిస్తున్నామన్నారు. స్వామి వారి నిధులను ఏ విధంగానూ దుర్వినియోగం చేయడం లేదని చెప్పారు. శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటికి వచ్చాయని సింఘాల్‌ అన్నారు. టిటిడికి సంబంధించి అన్ని అంశాలపై చట్టపరంగానే ముందుకెళ్తామని అన్నారు. గతంలో మాదిరిగానే కైంకర్యాలు జరుగుతున్నాయని, ఆలయంలో మరమ్మతులు జరుగుతూనే ఉంటాయని సింఘాల్ పేర్కొన్నారు.

వంటకు ఆవసరమైన ఏర్పాట్లే తప్ప శ్రీవారి పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుడా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు నాటి టీటీడీ పాలక మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన స్పందించారు. ‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్‌ ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ పింక్ డైమండ్ వ్యవహారంపై టీటీడీ ఇప్పటికైనా తెరదెంచే ప్రయత్నం చేసినప్పటికీ విపక్ష టీడీపీ మాత్రం రాజకీయ కోణంలో ఓ వీడియో రూపొందించి దీన్ని తన సోషల్ మీడియా వేదికపై ప్రచారం చేస్తోంది. గతం నుంచి ప్రచారంలో ఉన్న అంశాలను గుర్తుచేస్తూ టీటీడీ పాలక మండలి పరువు నష్టం దావా కేసును వెనక్కి తీసుకున్న అంశాన్ని విమర్శనాత్మక ధోరణిలో కామెంట్ చేస్తూ ఈ వీడియో పోస్టును తన సోషల్ మీడియా వాల్‌లో పోస్టు చేసింది. అదేమిటో మీరూ ఓ లుక్ వేయండి…