అప్‌డేట్‌ కాక నష్టపోతున్న అర్హులు

పోస్టాఫీసులో నిరుపయోగంగా ఆధార్ కేంద్రం

అదనంగా ఆధార్ కేంద్రాలను తెరవాలని డిమాండ్

కాకినాడ, అక్టోబర్ 16 (న్యూస్‌టైమ్): ఆధార్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. ప్రభుత్వ మీసేవా కేంద్రాలు మినహా మిగతా వాటిలో ఆధార్‌లో సవరణలు చేసుకునే అవకాశా న్ని ఏడాది కిందట తొలగించడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ ప్రభుత్వ పథకానికైనా ఆధార్‌ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో తమ ఆధార్‌ కార్డుల్లో ఉన్న తప్పుల సవరణకు అవకాశం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ రాయితీలు సంక్షేమ పథకాలు అమలు అర్హులుగా గుర్తించేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. పాఠశాలలో ప్రవేశాలకు, పలు రకాల పింఛన్లు కు విద్యార్థుల దగ్గర నుండి వృద్ధుల వరకు ఆధార్ అవస్థలు తప్పడం లేదు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆధార్ కేంద్రం నిర్వహించారు.

అనంతరం మీ సేవ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు జారీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు సవరణలో భాగంగా పేరు చిరునామా పుట్టిన తేదీ మరికొన్ని సవరణలు చేసి కొత్త కార్డులు మంజూరు చేసేవారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాల్లో ఆధార్ కార్యకర్తలకు నిలిపివేసి స్థానిక పోస్టాఫీసు ద్వారా నమోదు చేసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. కానీ స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. కేవలం యూనియన్ బ్యాంక్‌లో ఒక్కచోట మాత్రమే ఈ ఆధార్ కేంద్రం పనిచేస్తుంది. మండల కేంద్రమైన రాయవరం యూనియన్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ద్వారానే మండలం పరిధిలోని 12 గ్రామాల వారే కాక ఇతర గ్రామాల నుండి కూడా వచ్చి ఈ ఆధార్ కేంద్రాన్ని వినియోగించుకుంటున్నారు.

ప్రతి రోజు ఉదయం బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడి ప్రయోజనం లేదని వాపోతున్నారు. పరిమిత సంఖ్యలోనే అర్జీలు స్వీకరించడం ద్వారా పూర్తి స్థాయిలో ఆధార్ సేవలు అందడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. సంవత్సర కాలం నుండి చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల వరకు కొత్త ఆధార్ కార్డ్ ఆధార్ సవరణ కోసం నిత్యం బ్యాంకు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు ఆధార్ కేంద్రం వద్ద కనిపించడం లేదంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. చిన్నారులు వేలిముద్రలు నవీకరణకు ఈ కేంద్రం వద్ద తల్లి పడుతున్న ఇబ్బందులు వివరించలేదని వాపోతున్నారు. ఆధార్ కోసం పేరు నమోదు చేయించుకున్న తర్వాత వారికీ తేదీ సమయం కేటాయించడం జరుగుతుందని, ప్రతిరోజు సమయాన్ని బట్టి మూడు నుండి 35 మందికి మాత్రమే ఆధార్ కార్డ్ అవుతుందని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టి రాయవరం మండలం లో మరొక ఆధార్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ సచివాలయంలో గాని, పోస్ట్ ఆఫీస్‌లో గాని, మీ సేవ కేంద్రాల్లో గానీ ఆధార్ సేవ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో మీ సేవ కేంద్రాలు, బ్యాంకులు మూత పడటంతో పుట్టిన తేదీ, చిరునామాలో మార్పులు, చేర్పులు, చిన్నపిల్లలకు ఆధార్‌ తీయించడం, ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు వేలిముద్ర, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం, ఆధార్‌కు సెల్‌ఫోన్‌ నెంబర్‌ లింక్‌, వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి ఆధార్‌ అనుసంధానం తదితర కార్యకలాపాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతున్నారు. గతంలో ఆధార్‌లో సవరణల కోసం రూ.50లు వసూలు చేసేవారు.

కానీ, ప్రభుత్వం తాజాగా దాన్ని రూ.100లకు పెంచింది. ఆధార్‌లో సవరణలు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉ న్నా నష్టపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరైంది. నమోదు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించక తప్పడం లేదు. నమోదు కోసం అధికంగా వసూలు చేస్తున్నారు. తప్పని సరిపరిస్థితుల్లో కార్డుల కోసం డబ్బులు చెల్లిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను ఎత్తివేయడంతో గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నామని, రూ.300 ఇస్తే ఇంటి వద్దే వేలిముద్రలు, ఐరిష్ తీసుకుంటున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.