అభివృద్ధికి చిరునామా తెదేపా: మంత్రి సోమిరెడ్డి

2132

నెల్లూరు, మార్చి 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో బుధవారం మంత్రి పర్యటించారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్‌ను గ్రామస్తులకు అందుబాటులోకి తెచ్చిన మంత్రి సోమిరెడ్డికి అర్ధరాత్రి అయినా ఎదురుచూసి ఘనస్వాగతం పలికి బ్రహ్మరథం పలికారు మడమనూరు వాసులు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ మడమనూరు పంచాయతీలో చరిత్రలో ఎన్నడూలేని విధంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి జరగడంతో పాటు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గత ప్రభుత్వాల పదేళ్ల హయంలో జరిగిన అభివృద్ధి కంటే టీడీపీ ఈ ఐదేళ్ల పాలనలో ఏ గ్రామం చూసినా నాలుగైదింతల ఎక్కువ అభివృద్ధి చేశామన్నారు.

పొదలకూరు మండల ప్రజల ఓట్లతో పదవులు అనుభవించిన వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా బీడుగా మిగిల్చిచేశారని, తాను ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టి కండలేరు ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడంతో పాటు సోమశిల జలాలను దక్షిణ కాలువ ద్వారా పొదలకూరు మండలానికి తీసుకొచ్చానని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరగకూడదని ఎమ్మెల్యే కోరుకుంటున్నారని, దేవుడి దయ వల్ల అన్ని పనులు సజావుగా సాగిపోతున్నాయన్నారు. రూ.4.60 కోట్లతో పొదలకూరు మండల ప్రజల కోసం మెగా మినరల్ వాటర్ ప్లాంట్ అందుబాటులోకి తెస్తుంటే వైకాపా నాయకులు మాత్రం టీడీపీ అభిమానుల ఓట్లను తొలగించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే మాటలు విని ఒక్క పొదలకూరు మండలంలోనే 1700కి పైగా ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించి 33 మంది కేసుల్లో ఇరుక్కుపోయారన్నారు.

పీకే (ప్రశాంత్ కిషోర్) సూచనలతో ఫారం-7ను దుర్వినియోగం చేసి ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. జగన్ తీరు దొంగే దొంగ అన్నట్లు వుందని, టీడీపీ సానుభూతిపరులు ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించి వైకాపా నాయకులు అడ్డంగా దొరికిపోయారన్నారు. రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి విఫలం చెంది పార్టీని పీకే చేతిలో పెట్టారన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాదని, ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీని నడిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని 54 లక్షల ఒట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, జగన్ మిత్రుడు కేసీఆర్ 54 లక్షలు ఓట్లు తొలగిస్తే జగన్ 8 లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఓట్లు తొలగించాలని అర్జీలు పెట్టిన వారు ఆధారాలతో దొరికిపోయారని, వందల మంది వైకాపా కార్యకర్తలను ముద్దాయిలుగా మార్చారన్నారు. లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమాచారాన్ని క్రోడీకరించి సేవా మిత్ర యాప్‌ను రూపొందించామని, యాప్‌ను రూపొందించిన కంపెనీలపై దాడి చేస్తున్నారని, చట్టానికి లోబడి ఏ సమాచారాన్ని ఉపయోగించుకున్నా తప్పు లేదని, జగన్ రూపంలో కేసీఆర్ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను కేసీఆర్ ఇప్పటివరకు చెల్లించలేదని, పోలవరం నిర్మాణం ఆపేందుకు కేసులు వేస్తున్నారని, షెడ్యూల్ 9, 10 ఆస్తులను ఇంతవరకు పంపకం చేయలేదని, ఒక రాష్ట్ర వ్యవహారాల్లో మరో రాష్ట్రం తలదూర్చడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, దేశంలో తమ కన్నా గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన రాష్ట్రం లేదన్నారు. తాము రెండు వేలు పింఛన్ ఇస్తే వేలం పాట మాదిరిగా రూ.3 వేలు ఇస్తామని ప్రజలని మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు.