సుదీర్ఘ విరామం తర్వాత అజిత్‌‌తో వడివేలు

102

చెన్నై, నవంబర్ 15 (న్యూస్‌టైమ్): తమిళ సినీ స్టార్ అజిత్‌తో తెరమీద సందడిచేయాలని చాలా మందికి ఉంటుంది. అదే ఆయనతో కలిసి నటించాలని తమిళనాట హాస్య నటులు ఆశించడం సహజం. ఇకపోతే, దాదాపు పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అజిత్‌తో సందడి చేయడానికి వడివేలు ఉవ్విళ్లూరుతున్నారు. తమిళ సినీ ప్రపంచంలో తిరుగులేని మహారాజు వడివేలు. అయితే కొన్ని కారణాలతో ఆయన తెరపై పూర్తిసాయిలో కనిపించడం లేదు. ఇటీవల హీరోగా రీఎంట్రీకి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

దీంతో మళ్లీ ఆయన హాస్య, గుణచిత్ర పాత్రలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’లో ఆయన నటిస్తున్న కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, దాదాపు 17 సంవత్సరాల తర్వాత అజిత్‌ చిత్రంలోనూ నటిస్తున్నారని సమాచారం. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది అజిత్‌కు 60వ చిత్రం. ఈ సినిమాలోనే వడివేలు హాస్యపాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరు ఎళిల్‌ దర్శకత్వంలోని ‘రాజా’ చిత్రంలో కలిసి నటించారు. అయితే, అప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో ఆ తర్వాత కలిసి నటించలేదు. ఇదిలా ఉండగా ‘వలిమై’లో కలిసి నటిస్తున్నారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.