అహ్మద్ పటేల్ హవాలాతో టీడీపీకి లింకు?

277
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్

రాజకీయంగా ఏదైనా జరగవచ్చు. అయితే, ఎన్నికల ముందు, అధికారాన్ని పంచుకోవడానికి ఇలాంటివి జరిగిన, జరుగుతున్న సందర్భాలు అనేకం. కానీ, ప్రధాన ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఇరుకునపెట్టే ప్రయత్నాలకు మాత్రం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ వేదికగా మారుతూ వస్తోంది. తాజాగా కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీకి లింకు పెడుతూ ఒక వర్గం మీడియాలో బుధవారం ప్రచురితమైన ప్రధాన వార్త సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌కు రాష్ట్రం నుంచి అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఏకంగా 400 కోట్ల రూపాయల మేరకు నిధులు చేరాయన్నది వార్త సారాంశం. అయితే ఇందులో నిజమెంతో రాసినవారికే తెలియాలి.

రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్ తదితరులతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల వ్యూహ రచనలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు

‘ఏపీ హ‌వాలా కేసులో అహ్మ‌ద్ ప‌టేల్‌కు నోటీసులు’ అంటూ ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన కథనాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ అహ్మ‌ద్ ప‌టేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని, తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ద్వారా క‌ర్నాట‌క‌లోని బెంగ‌ళూరుకు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడి నుంచి ఢిల్లీలోని అహ్మద్ పటేల్‌కు నిధులు చేరాయని ఇది వ‌ర‌కే చెప్పిన ఐటీ, ఈడీ అధికారులు ఇప్పుడు అదే విషయంలో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు నోటీసులు జారీచేసినట్లు వార్తాంశం.

ఈ హవాలా వ్యవహారంతో మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందనే వార్తలు రావటం గమనార్హం. అయితే, దీనిపై చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తమ అధినేతను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే అసలు తమకు ఎలాంటి సంబంధం లేని విషయాలతో ముడిపెడుతూ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్‌కు హవాలా రూపంలో డబ్బు ఇవ్వాల్సిన అవసరం తమకు ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

మరోవైపు, ‘ప్రజా చైతన్య యాత్ర’ పేరిట చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇలా సంచలన ఆరోపణలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం. గతంలో ఈడీని, సీబీఐనీ అడ్డంపెట్టుకుని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై సాగిన ప్రచారం తరహాలోనే ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపైనా రాజకీయం దుమారం రేగడం యాదృచ్చికమనే చెప్పాలి. అయితే, ఈ ఆరోపణలపై అటు అహ్మద్ పటేల్, ఇటు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.