ఎయిర్‌టెల్ రీఛార్జ్ ఇప్పుడు అక్కడ కూడా…

220
భారతి ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్
  • లాక్‌డౌన్ మినహాయింపు చోటల్లా లభ్యం

హైదరాబాద్, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): టెలికం ధిగ్గజం ఎయిర్‌టెల్ తన చందాదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవటానికి సౌకర్యంగా ఆన్‌లైన్ సదుపాయాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు బ్యాంకు ఎటీఎంలు, కిరాణా దుకాణాలు, మందుల షాపులలోనూ అందుబాటులో ఉంచింది. ట్రాయ్ సూచన మేరకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఇన్‌కమింగ్ కాలపరిమితి పొడిగించిన విషయం తెలిసిందే.

తక్కువ ఆదాయం కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులకు సంస్థ పది రూపాయల టాక్‌టైమ్‌ను కూడా ఆఫర్ చేసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా బహిరంగ మార్కెట్‌లో అన్ని రకాల దుకాణాలు, మొబైల్ రీఛార్జ్ సెంటర్లూ అందుబాటులో లేని కారణంగా వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాజాగా బ్యాంకు ఏటీఎంల ద్వారాను, నిత్యావసర సరుకులు విక్రయించే కిరాణా దుకాణాలు, అత్యవసర సర్వీసుల కిందకు వచ్చే మెడికల్ షాపుల్లోనూ రీఛార్జ్ సదుపాయం అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసినట్లు చందాదారులకు పంపిన వ్యక్తిగత సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్)లో ఎయిర్‌టెల్ తెలిపింది.

అదే విధంగా భారతి ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ వినియోగదారులకు పంపిన మెయిల్‌లో ‘‘ఆన్‌లైన్‌లో లేని పెద్ద జనాభా ఉందని, వారి రెగ్యులర్ రిటైలర్ల వద్ద రీఛార్జ్ చేయలేకపోతున్నారని కూడా మేము గుర్తించాము. దీనిని పరిష్కరించడానికి, మేము అనేక కొత్త ఛానెల్‌లను సక్రియం చేసాము. వాటిలో భాగంగా బ్యాంక్ ఎటీఎంలు, ఫార్మసీలతో పాటు కిరాణా దుకాణాలను ఎంపికచేశాము’’ పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో ఎయిర్‌టెల్ భాగస్వాములు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, అపోలో, బిగ్ బజార్ తదితర చోట్ల వినియోగదారులు తమ రీఛార్జ్ అవసరాలు తీర్చుకోవచ్చని గోపాల్ విట్టల్ సూచించారు.