పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చర్చిస్తున్న దృశ్యం

ఎస్ఈసీ రమేష్‌కుమార్‌కు వివరించిన గంధం…

అనంతపురం, జనవరి 27 (న్యూస్‌టైమ్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డాక్టర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వివరించారు. బుధవారం ఉదయం విజయవాడ నుండి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డిజీపీ గౌతమ్ సవాంగ్‌లతో కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అనంతపురం ఎన్ఐసీ భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణా టాటా, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స, అభివృద్ధి) ఎ. సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది కోసం అవసరమైన మాస్కులు, శానిటైజర్‌లు అందజేయాలన్నారు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ శోభా స్వరూపారాణి, డీపీఓ పార్వతి, డిప్యూటీ కలెక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.