చంద్రబాబుపై ఆళ్ల నాని ఎదురుదాడి

149
ఏలూరులో శనివారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామాక పత్రాలను అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

ఏలూరు, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాలుగు నెలల కాలంలోనే 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. స్ధానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా నలుమూలల నుండి వచ్చిన పలువురు నిరుద్యోగ యువతకు గ్రామ సచివాలయ ఉద్యోగ నియామాక పత్రాలను ఆయన అందజేశారు.

ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసగించి నేడు ప్రభుత్వంపై బురద జల్లే కార్యాక్రమాన్ని పెట్టుకున్నారని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన యువత చంద్రబాబు మాటలను అపహాస్యం చేస్తున్నారని ఆళ్ల నాని చెప్పారు. నాలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు వాస్తవాలు గ్రహించకపోవడం విడ్డురంగా ఉందని ఆయన చెప్పారు. అధికారికంగా 1.35 లక్షల ఉద్యోగాలను ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శికంగా ప్రభుత్వం నియమించిందని గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను కూడా కలిపి మొత్తం 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు కళ్లకు కనిపించడం లేదా అని నాని ప్రశ్నించారు.

ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు చెబితే రాజకీయ మనుగడ ఉంటుందన్న విషయం చంద్రబాబు గ్రహించాలని నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బొద్దాని శ్రీనివాస్‌, మంచెం మైబాబు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ, సుధీర్‌ బాబు, మున్నల జాన్‌ గురునాధ్‌, సిరిపల్లి ప్రసాద్‌, కిలాడి దుర్గారావు, కిరణ్‌ కుమార్‌, నెరుసు చిరంజీవి, రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ దిరిశాల వరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.