పూర్వవిద్యార్థులు మేధో సహకారం అందించండి

0
9 వీక్షకులు
కార్యవర్గ సభ్యులతో చర్చిస్తున్న గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్)
  • ఏయూ పూర్వవిద్యార్థుల సమావేశ నిర్వహణపై సమీక్ష

  • వ్యవస్థాపక అధ్యక్షుడు గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్‌)

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయానికి పూర్వవిద్యార్థులే నిజమైన సంపదగా నిలుస్తారని, వర్సిటీకి వీరు మేధోసహకారం అందించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల సంఘం (అపూస) వ్యవస్థాపక చైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్‌) అన్నారు.

శనివారం ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం వేవ్స్‌ 2019 నిర్వహణపై ఆయన కార్యవర్గ సభ్యులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన ఏయూ పూర్వవిద్యార్థులు తమ అనుభవాన్ని, మేధస్సును విశ్వవిద్యాలయం ఉన్నతికి వినియోగించాలని సూచించారు. విశ్వవిద్యాలయ ఆచార్యులు ఎంటర్‌ప్యూనర్‌షిప్‌ను ప్రోత్సహించాలన్నారు. అమెరికా, బెంగళూరులలో పూర్వవిద్యార్థుల సంఘం శాఖలను ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్వవిద్యార్థులతో నిరంతరం అనుసంధానం అయ్యే విధంగా అపూస పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు పూర్వవిద్యార్థులే విలువైన సంపదగా నిలుస్తున్నారన్నారు. పూర్వవిద్యార్థుల సమావేశ నిర్వహణ, అతిధుల ఆహ్వానాలు, వేదిక ఏర్పాట్లు, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన రెడ్డి హాజరు అవుతారన్నారు. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర మంత్రులు సమావేశానికి హాజరవుతున్నారన్నారు. ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఏయూ పరిధిలోని కళాశాలల పూర్వవిద్యార్థులంతా అపూసా సభ్యులుగా సత్వరం చేరాలని కోరారు.

సంఘం చైర్మన్‌ ఆచార్య బీల సత్యనారాయణ మాట్లాడుతూ డిసెంబర్‌ 13న జరిగే పూర్వవిద్యార్థుల సంఘం వార్షిక సమావేశానికి పూర్వవిద్యార్థులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులుగా చేరాలని కోరారు. విదేశాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడిన పూర్వవిద్యార్థులంతా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.దిల్లీ, ముంబాయి, హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలలో పూర్వవిద్యార్థుల సమావేశ వివరాలను తెలియజేస్తూ విస్తృత ప్రచారం జరపాలని నిర్ణయించారు.

సమావేశానికి విచ్చేసే పూర్వవిద్యార్థులను ఆహ్వానం పలుకుతూ విశాఖపట్నం విమానాశ్రమంలో ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో సంస్థ ఉపాద్యక్షుడు మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివ రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, కార్యదర్శి బి.మోహన వెంకట రామ్‌, సంయుక్త కార్యదర్శి కుమార్‌ రాజ,జేమ్స్‌ స్టీఫెన్‌, ఆడిటర్‌ ఏ.చంద్రశేకర్‌, రాంజీ, భువన, ఆచార్య వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.