‘‘కృష్ణ నదికి వరద వచ్చినప్పుడే, కొండవీటి వాగుకి కూడా వరద వస్తే, అది వెనక్కి తన్ని అమరావతిలో కొన్ని ప్రాంతాలు ముంపుకి గురవుతాయి. అంటే రాజధానికి ముప్పు కృష్ణా నది వరదతో కాదు, కొండవీటి వాగుతోనే. చంద్రబాబు ఈ ముంపు నివారణ కోసం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కట్టారు. అక్కడే కొండవీటి వాగుని గుంటూరు ఛానెల్‌కి మళ్లించే ఏర్పాటు చేశారు. అంటే కొండవీటి వాగుకి వరద వస్తే, వరదలో కొంత భాగం గుంటూరు ఛానల్‌కి డైవర్ట్ చేస్తారు, మిగతాది ఎత్తిపోతలు ద్వారా కృష్ణ నదిలోకి ఎత్తి పోస్తారు. కృష్ణా నదికి ఎంత భారీ వరద వచ్చినా గరిష్ఠంగా 18.4 అడుగులకు మించదు. అయినా ముందు చూపుతో 22 అడుగుల ఎత్తులో డిశ్చార్జి పాయింట్‌ను నిర్మించారు.

ఈ పాయింట్‌ నుంచి పంప్‌హౌస్‌ మధ్య 16 వరుసల పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. అమరావతికి ఉన్న వరద ముప్పు, అమరావతి కట్టక ముందే సాల్వు చేసేసారు. గత వందేళ్లలో కృష్ణా నదికి ఒక్కసారి మాత్రమే 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అది.. 2009లో. అప్పుడు కూడా అమరావతిలోకి చుక్క నీరు రాలేదు. ఇప్పుడు మనం చూస్తున్న వరద 8 లక్షల క్యూసెక్కులు. ఇప్పుడు కొండవీటి వాగు ఉండటంతో, ఇప్పుడు ఎంత వరద వచ్చినా అమరావతి తట్టుకుంటుంది. ఏదైనా కుట్ర చేస్తే తప్ప, అమరావతిలో చుక్క వరద నీరు వచ్చే అవకాశమే లేదు.’’ అని తెలుగుదేశం పేర్కొంది.

ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి ప్రాంతం ముంపునకు గురైందన్న నేపథ్యంలో అధికార పార్టీ ప్రచారానికి ప్రతిస్పందనగా ప్రతిపక్ష టీడీపీ కూడా సోషల్ మీడియా వేదికగానే తన తిరుగుబాటు యుద్దాన్ని ప్రకటించింది. కృష్ణా నదికి అసలు వరద ఎలా వస్తుంది? అమరావతికి అసలు ముప్పు ఉందా? లేదా? తదితర అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వ వ్యతిరేక మీడియా ఒకపక్క ఇప్పటికే ప్రచారం చేస్తుండగా, గత కొద్ది రోజుల నుంచి అనుకూల మీడియా కూడా ప్రచారాన్ని విస్తృం చేసింది. చివరికి ఈ వాదప్రతిదానలు ఎటువైపునకు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.