ఏయూకు అంబులెన్స్‌ బహూకరణ

48
డాక్టర్‌ మల్లికార్జున రావును సత్కరిస్తున్న వీసీ ప్రసాద రెడ్డి

విశాఖపట్నం, జనవరి 6 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయుక్తంగా అధునాతన అంబులెన్స్‌ సమకూరింది. మైలాన్‌ లాబరేటరీ సంస్థ సామాజిక బాధ్యతగా వర్సిటీకి దీనిని అందించింది. సోమవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డికి మైలాన్‌ లాబరేటరీ హెచ్‌ఆర్‌ హెడ్‌ డాక్టర్‌ ఎన్‌.మల్లికార్జునరావు విచ్చేసి అంబులెన్స్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ మల్లికార్జున రావు మాట్లాడుతూ అల్ట్రామోడరన్‌ అంబులెన్స్‌ను వర్సిటీకి అందించడం జరిగిందన్నారు. అక్సిజన్‌ సిలెండర్‌, డాక్టర్‌, సహాయకులు కూర్చునే విధంగా అవసరమైన సదుపాయాలు కల్పన చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు, ఉద్యోగుల సేవలకు దీనిని ఉపయోగించాలని వర్సిటీని కోరారు. వర్సిటీకి సేవచేసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం, పరిశ్రమల మధ్య సమన్వయం, సహకారం పెరగాలని సూచించారు.

అంబులెన్స్‌ తాళాలను వర్సిటీకి అందిస్తున్న మైలాన్‌ ప్రతినిధులు

ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి పరిణామమన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమలు ప్రత్యేక ఇనిస్టిట్యూషనల్‌ చైర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై పలు ప్రభుత్వరంగ సంస్థలు ఇప్పటికే సుముఖత చూపాయన్నారు. ఇదే తరహాలో నిర్ణీత కాలపరిమితితో ఇనిస్టిట్యూషన్‌ చెయిర్‌ను మైలాన్‌ ల్యాబరేటరీస్‌ ఏర్పాటు చేయాలన్నారు.

అంబులెన్స్‌ ప్రత్యేకతను వీసీ ప్రసాదరెడ్డికి తెలియజేస్తున్న డాక్టర్‌ మల్లికార్జున

ఏయూలో సైన్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వర్సిటీలో పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని మైలాన్‌ సంస్థను ఆహ్వానించారు.అనంతరం వర్సిటీ తరపును మైలాన్‌ సంస్థ ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో ప్లాంట్‌ హెడ్స్‌ సునీల్‌ వాద్ర, రామ రాజు, హెచ్‌ఆర్‌ హెడ్స్‌ సరస్వతి రావు, బ్రహ్మాజి, శ్యాం ప్రసాద్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.