న్యూఢిల్లీ, జనవరి 8 (న్యూస్టైమ్): జమ్మూకాశ్మీరులో పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి కేంద్ర రంగ పధకానికి సీసీఈఎల్ ఆమోదం తెలపడంపట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హర్షంవ్యక్తం చేశారు. ట్వీట్ల ద్వారా షా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీలపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘తీవ్రవాదం వేర్పాటువాదాలను నిర్మూలించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 28,400 కోట్ల రూపాయల కేంద్రప్రభుత్వ పథకంతో జమ్మూకాశ్మీర్ పట్ల తనకున్న అభిమానాన్ని, రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను మోడీ వెల్లడించారు’ అని షా పేర్కొన్నారు.
‘మోడీ దూరదృష్టితో తొలిసారిగా బ్లాకు స్థాయి నుంచి అభివృద్ధి సాధనకు పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. దీనివల్ల స్వదేశీ ఉత్పత్తులు పెరిగి బ్లాకు స్థాయి నుంచి నూతన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్ర అభివృద్ధికి మోడీజీ తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను’ అని ఆయన అన్నారు. ‘కాశ్మీర్లో కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర పథకం ఒక వరం. ఇది రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను ఎక్కువ చేస్తాయి. ఉత్పత్తి సేవా రంగాలలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడే ఈ పథకం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కలిగిస్తుంది’ అని షా అన్నారు. ‘పథకం కాశ్మీర్లో నూతన అధ్యాయానికి నాంది పలికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించి 4. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. పథకం కాశ్మీర్ యువత నైపుణ్యాలను పెంచి, పరిశ్రమల పని తీరు మెరుగుపడడంతో రాష్ట్రం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోటీ పడగలుగుతుంది’ అని షా పేర్కొన్నారు.