అమ్మకానికి ఆంధ్రప్రదేశ్

61
  • ఆ ఘనత సీఎం జగన్‌దే: టీడీపీ

విజయవాడ, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): ‘మిషన్ బిల్డ్’ పేరిట మరో క్విడ్ ప్రోకోకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెరలేపారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. విజయవాడలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మిషన్ బిల్డ్’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టారని ఆమె ఆక్షేపించారు.

ప్రభుత్వ ఆస్తులు అమ్మే సీఎం ఎక్కడా ఉండరని, ఆ ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే చెందుతుందని ఎద్దేవా చేశారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌ని పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సంపద సృష్టించడం చాలా కష్టం అనేది సీఎం గ్రహించాలని హితవుపలికారు.

ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదని స్పష్టంచేశారు. సీఎం వెంటనే ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు.