కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైళ్లు రద్దయ్యాయి. అయితే, పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 22 రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

కరోనాకు ముందు దక్షిణ మధ్య రైల్వేలో రోజుకు 291 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రత్యేక రైళ్ల పేరిట ఇప్పటి వరకు 170 రైళ్లను పునరుద్దరించారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల పేరిట దశల వారీగా రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న రైళ్లలో సికింద్రాబాద్‌-విశాఖ గరీబ్‌‌రథ్‌ (12739), సికింద్రాబాద్-విజయవాడ (12800), సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ (12735), కాచిగూడ- గుంటూరు (17252) రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు ఔరంగాబాద్‌-రేణిగుంట, నాందేడ్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌, జియవాడ-షిర్డీ, నాందేడ్‌-సంత్రాగచి, నాందేడ్‌-ఔరంగాబాద్‌, నాందేడ్‌-శ్రీగంగానగర్‌ రైళ్లు కూడా మళ్లీ పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్లలు రద్దయిన విషయం తెలిసిందే.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్‌లాక్ దశ నుంచి మళ్లీ రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పుడు చాలా రైళ్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ ప్రత్యేక రైళ్లు. టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ టికెట్లకు కూడా ముందుస్తు రిజర్వేషన్ తప్పనిసరి. టికెట్లు ఉన్న వారినే రైల్వే స్టేషన్ లోపలికి అనుమతిస్తారు.