హైదరాబాద్, అక్టోబర్ 17 (న్యూస్‌టైమ్): మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడ నంగా మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాం తాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర–దక్షిణ గుజరాత్‌ తీరాలకు దగ్గరలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఫీడర్ల పరిధిలో వంద శాతం విద్యుత్‌ పునరుద్ధరణ జరిగినట్టు ఏపీ విద్యుత్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతోందని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ నాగలక్ష్మి చెప్పారు. ఇంత త్వరగా విద్యుత్‌ సరఫరా చేయడం రికార్డు అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు రోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది.

ఈ నెల 13న 134 మిలియన్‌ యూనిట్ల వాడకం ఉంటే 15న 150.9 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. అంటే రెండు రోజుల్లోనే 16 ఎంయూలు పెరిగింది. రానురాను ఇంకా డిమాండ్‌ పెరగొచ్చని డిస్కమ్‌ల సీఎండీలు హరినాథ్‌రావు, నాగలక్ష్మి, పద్మా జనార్దన్‌రెడ్డి నివేదిక పంపారు. కాగా, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యుత్‌ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, వరదల సమయంలో విద్యుత్‌ అంతరాయాలు లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తుపాను, వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై సీఎం విద్యుత్‌ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి మీడియాకు వెల్లడించారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సీఎం ముందుంచారు. రాష్ట్రంలో 13,648 ఫీడర్లున్నాయి. తుపాను కారణంగా 170 ఫీడర్ల పరిధిలో బ్రేక్‌ డౌన్లు వచ్చాయి. ఇప్పటి వరకు 165 ఫీడర్లలో విద్యుత్‌ను పునరుద్ధరించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ అంతరాయాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. వీటిని కూడా చాలా వరకు పరిష్కరించారు. మొత్తం 1,263 ఫీడర్లలో 23 బ్రేక్‌ డౌన్‌ అయ్యాయి. ప్రస్తుతం 22 ఫీడర్లు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. తాత్కాలిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టే ఏర్పాట్లు చేశామని ఇంధనశాఖ ఉన్నతాధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి, బ్రేక్‌డౌన్లు రాకుండా చూడగలిగామని ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు. డిస్కమ్‌లు ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికపై లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) రాబోయే పరిస్థితిని అంచనా వేసింది. ఈ నెలాఖరుకు రోజుకు 160 ఎంయూల విద్యుత్‌ డిమాండ్‌ ఉండే వీలుందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ప్రస్తుతం 800 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్‌ పనిచేస్తోంది. మరో యూనిట్‌ను ఉత్పత్తిలోకి తేవడానికి అవసరమైన బొగ్గు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహానది కోల్‌ ఫీల్డ్ (ఎంసీఎల్‌)తో అధికారులు చర్చించారు.