హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ సుప్రీంలో పిటిషన్
అమరావతి, న్యూఢిల్లీ, ఆగస్టు 8 (న్యూస్టైమ్): మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పరిపాలన విభాగాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్నంకు తరలించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీని కోసం ఇటీవల సీఆర్డీయే రద్దు బిల్లుకు ఆమోదముద్ర వేయగా హైకోర్టు దీనిపై ఆగస్టు 14 వరకు స్టేటస్ కో విధించింది. దీంతో తరలింపు పక్రియ ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపతట్టింది. ఈ మేరకు ప్రభుత్వం తరుపున శనివారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
మూడు రాజధానుల ప్రకటన తర్వాత అనేక చిక్కులు వచ్చిపడుతున్నాయి. CRDA, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మండలిలో అడ్డుకున్నారు. అయినా కూడా గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు కేసు వేయడంతో ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఇలా అయితే మూడు రాజధాను ప్రక్రియ ప్రారంభం ఆలస్యం అవుతుందని భావించి సుప్రీంకు వెళ్లారు.
అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సోమవారం విచారణకు రావచ్చంటున్నారు. మరోవైపు, విశాఖలో ఈ నెల 16న రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం కూడా ఊపందుకుంది. అందుకే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని సుప్రీంకు వెళ్లారనే వాదనలు వినబడుతున్నాయి.