ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, పాత్రికేయుల గుర్తింపునకు ప్రాధమిక, ప్రామాణికమైన అక్రిడిటేషన్ కార్డుల జారీలో అసంబద్ధ నిర్ణయాలతో వ్యతిరేక ధోరణి అవలంబించిందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు విమర్శించారు. మునుపెన్నడూ లేనంతగా ప్రభుత్వం జర్నలిస్టుల గుర్తింపు విషయంలో వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఐవీ, ఇదే సమయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు రాష్ట్రంలోని జర్నలిస్టులంతా సహకరిస్తూ వచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం సీఎం తీరు పాత్రికేయ లోకాన్ని తీవ్ర మనోవేధనకు గురిచేస్తోందన్నారు.

‘‘అక్రిడిటేషన్‌ కార్డుల జారీపై అడ్డగోలు నిబంధనలతో జర్నలిస్టులకు అవమానం జరిగింది. అందుకే, నూతన సంవత్సరం మొదటి రోజు నుండే సమరశంఖం పూరిస్తున్నాం. జర్నలిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం. దమ్ముంటే సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, కమిషనర్‌లు జిల్లాల్లో తిరగండి.. మేమెంటో చూపిస్తాం. జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ సత్తా ఏంటో చూపిస్తాం.. ప్రభుత్వంలో అవినీతిని వెలికితీస్తాం. మేము తలుచుకుంటే మంత్రి తిరిగి మచిలీపట్నం ఎమ్మెల్యేగా మిగలాల్సిందే.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘కేసులున్న రాజకీయ నాయకులు మంత్రులుగా చేయడం లేదా? ఒకరిద్దరు చెడ్డ వాళ్ళు వుంటే వ్యవస్థ మొత్తం మీద కత్తికడతారా? జర్నలిస్టులు శాశ్వతం. ప్రభుత్వం ఉంటది.. పోతది. అక్రిడిటేషన్‌లు లేకపోయినా జర్నలిస్ట్‌లు జర్నలిస్టులు కాకుండాపోతారా? చట్టంలో వర్కింగ్ జర్నలిస్ట్ అన్నారే గానీ, అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అనలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. లేదంటే తగిన మూల్యం చెల్లించుకునేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉండాల్సిందే.’’ అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంతటి నిర్బంధాన్ని జర్నలిస్టులపై ఎప్పుడూ విధించలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలను కూడా కేటాయించి ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. అక్రిడిటేషన్‌ల విషయం ఏనాడూ ఇబ్బందిపెట్టలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గానీ, పాత్రికేయుల జోలికి వచ్చే సాహసం చేయలేదు.’’ అని అన్నారు.

‘‘జర్నలిజంలో ఉన్నవారిలో దాదాపు 90 శాతానికి పైగా తెల్లకార్డుదారులన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. వారు కూడా పేదలే అని ఎప్పుడూ మరువరాదు. అన్ని వర్గాలకూ అన్నీ ఇస్తున్న జగన్ ప్రభుత్వం పాత్రికేయుల విషయానికి వచ్చేసరికి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు.’’ అని సుబ్బారావు తెలిపారు.