ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం నేత దేవినేని ఉమా ధ్వజం

విజయవాడ, జులై 27 (న్యూస్‌టైమ్): ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమా) ఆరోపించారు. సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏపీ నాలుగో స్థానానికి వెళ్లడం చూస్తుంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతోందన్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని, ప్రభుత్వం కాకిలెక్కలు చూపిస్తూ తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.

‘‘కరోనా పరీక్షల ధరలు పెరిగిపోయాయి. పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య పెంచాలి. బాధితుల పట్ల వివక్ష చూపకుండా అవగాహన పెంచేందుకు, కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు’’ అని దేవినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆయన విమర్శించారు. కరోనా విధుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ (పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పాత్రికేయులకు) అందరికీ రూ.50 లక్షలు బీమా సదుపాయం కల్పించాలని, కరోనా మృతులకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరోనా సోకినవారు కోలుకునే వరకు రూ.10 వేలు, లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత 5 కేసులతో ప్రారంభమైన కరోనా ప్రస్తుతం రోజుకు 9 వేల కేసులవైపు పయనిస్తుందంటే కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమేరకు ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు.

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందడం చూస్తుంటే వారికి ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలు తీసుకోవడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కరోనా అంటే నిర్లక్ష్య వైఖరి ప్రజల్లో వచ్చిందంటే అది కేవలం ప్రభుత్వ చర్యలే ప్రధాన కారణమన్నారు. అయిదు నెలలుగా కరోనా కట్టడికి పూర్తిస్థాయి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపేందుకే ప్రతిపక్షం ఉందని, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here