నిబంధనల వెసులుబాటుకు వినతి

254
ఎన్ఎఆర్ఎ ప్రతినిధులతో మాట్లాడుతున్న బండి సురేంద్రబాబు
  • న్యాయబద్దంగా అక్రిడిటేషన్ల జారీకి విజ్ఞప్తి

  • సీఐపీఆర్‌కు లేఖ రాసిన ‘ఎన్ఎఆర్ఎ’

అమరావతి, మే 22 (న్యూస్‌టైమ్): మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఎఆర్ఎ) స్వాగతించింది.

అయితే, నిబంధనల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐపీఆర్) కమిషనర్‌కు ఓ లేఖ రాసింది. కరోనా విపత్తు సమయంలో దేశవ్యాప్తంగా ఇతర రంగాలతో పాటు మీడియా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రభుత్వానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని, ముఖ్యంగా ప్రింట్ మీడియాకు కొవిడ్-19 మహమ్మారి తీరని కష్టాన్ని, నష్టాన్నీ మిగిల్చిందని ఎన్ఎఆర్ఎ జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్రబాబు పేర్కొన్నారు.

ప్రకటనల ఆదాయం పూర్తిగా పడిపోయి వాటిల్లిన ఆర్ధిక సమస్యలకు తోడు న్యూస్‌ప్రింట్ కొరత, లాక్‌డౌన్ కారణంగా వాణిజ్య ప్రాంతాల్లోని ప్రింటింగ్ ప్రెస్‌ల మూసివేత, లోకల్ టీవీ ఛానళ్లు, వెబ్ మీడియా నిర్వహణకు కీలకమైన సాంకేతిక నిపుణులు, సిబ్బంది లభ్యత తగ్గడం వంటి వాటి వల్ల చిన్న, మధ్యతరహా పత్రికలు పాక్షికంగా ప్రచురణ నిలిచిపోయి ఖర్చు పెరిగినప్పటికీ డిజిటల్ సేవలను కొనసాగిస్తూ వస్తున్నాయన్నారు. ఈ ఆపత్కాల సమయంలో డిజిటల్ మీడియాలో వినియోగానికి సంబంధించి కేవలం వార్తల కవరేజీ పనిమీద తప్ప చివరికి కార్యాలయాలలో పనిచేసే వాతావరణం కూడా లేదన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో అక్రిడిటేషన్ల జారీకి దరఖాస్తుచేసుకునే గడువు 10 రోజులు ఇవ్వడం గమనించాల్సిన విషయమని సురేంద్రబాబు పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కొత్త కార్డుల జారీకి సాధ్యపడనప్పుడు ఇటువంటి విపత్కర సమయంలో ఎలా వీలుపడుతుందన్న అంశాన్ని విజ్ఞులుగా అధికారులకు తెలియందేమీ కాదని, మండల కేంద్రాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేకపోలేదన్నారు.

ఈ నేపథ్యంలో మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి నిబంధనల అమలులో సడలింపులు చేసి పాత దరఖాస్తులను ఆమోదించి, అర్హులందరికీ కార్డులు జారీచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పత్రికల కాపీలను, క్లిప్పింగ్స్‌ (ఫిజికల్ ఫైల్స్), జీఎస్టీ రిటర్న్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ జారీచేసే ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం వంటి వాటి విషయాలలో వెసులుబాటు కల్పించాలని కోరారు.

దరఖాస్తుదారులు గతంలో ఆన్‌లైన్‌లో సమర్పించిన అప్లికేషన్లను, సమర్పించిన అనుభవ ధ్రువీకరణ పత్రాలు, యాజమాన్యం ఇచ్చే కవరింగ్ లెటర్‌ను పరిగణనలోకి తీసుకుని అభ్యర్ధుల అర్హతలను పరిశీలించాలని కోరారు. కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చి, లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత ఆయా పత్రాలను సమర్పించే అవకాశాన్ని కల్పించాలని యూనియన్ తరఫున సురేంద్రబాబు విజ్ఞప్తిచేశారు.