మిషన్ భగీరథ పనులకు ప్రశంసలు

2633

హైదరాబాద్, మే 17 (న్యూస్‌టైమ్): మిషన్ భగీరథ లాంటి పథకాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు టి. రాజశేఖర్. చాలా రాష్ట్రాలు బోరు బావుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నాయని, నదీ జలాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనుల ప్రగతిని, పనిచేసే విధానాన్నీ, దీని వల్ల ప్రజలకు అందే సౌకర్యాలను పరిశీలించేందుకు వచ్చిన రాజశేఖర్ నేతృత్వంలోని కేంద్ర బృందం సిద్ధిపేట జిల్లాలో పర్యటించింది.

రాజశేఖర్ ముందుగా, గజ్వెల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ సంపుహౌస్‌ను పరిశీలించారు. కోమటిబండ నుంచి తాగునీరు సరఫరా అయ్యే తీరును మ్యాప్‌తో ఈఈ రాజయ్య వివరించారు. సంప్ హౌస్ మొత్తం తిరిగి నిర్మాణాలన్నింటినీ రాజశేఖర్ చూసారు. ఆ తరువాత మర్కుక్ మండలం ఎర్రవెల్లి, దాతర్పల్లిలోని భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. గ్రామస్తుల స్పందనను తెలుసుకున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట మండలం ముండ్రాయిలో 24 గంటలు తాగునీరు సరఫరా అవుతున్న గంగిరెద్దులోళ్ళ కాలనీకి వెళ్లారు. 24 గంటలు తాగునీరు అందించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంతో పర్యవేక్షణ, శ్రమ ఉంటే తప్ప 24 గంటలు తాగునీరు ఇవ్వడం సాధ్యం కాదన్నారు.

అక్కడి నుంచి ఎల్లుపల్లికి వెళ్లిన రాజశేఖర్ గ్రామస్తులతో మాట్లాడారు. అంతకుముందు కోమటిబండలో మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ పథకం అమలు చేస్తున్న విధానం గొప్పగా ఉందన్నారు. నీరు వృధా కాకుండా అమలు చేస్తున్న ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానం విప్లవాత్మకం అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలు మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని అమలుకు ప్రణాళికలు రచిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి బిహార్ రాష్ట్రం ఇప్పటికే ‘ఘర్.. ఘర్ కో పీనేకా పానీ’ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. మరో 7 రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయన్న సమాచారం తమకు ఉందన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవ్వడాన్ని కర్తవ్యంగా భావించాలన్నారు. రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో తాను గమనించిన అంశాలపై కేంద్ర తాగునీటి మంత్రిత్వ శాఖకు నివేదిక అందిస్తానని చెప్పారు. ఈ పర్యటనలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ చక్రవర్తి, కన్సల్టెంట్ నర్సింగరావు, గజ్వెల్ ఈఈ రాజయ్య, సిద్దిపేట ఈఈ శ్రీనివాసచారి, రాజేశ్వర్‌రావు, డీఈఈ నాగార్జున, నాగభూషణం పాల్గొన్నారు.