న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్టైమ్): బాలలకు ఉత్తమ ప్రయోజనాలు అందేటట్లు చూడటం కోసం బాల సంరక్షణ సంబంధిత వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని విధి విధానాలను ప్రవేశపెట్టేందుకు కౌమార ప్రాయంలోని వారికి న్యాయం (బాలల సంరక్షణ, వారి పరిరక్షణ) చట్టం, 2015ను సవరించాలి అంటూ కేంద్ర మహిళలు, బాల వికాస మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
ఈ సవరణలో వ్యాజ్యాల సత్వర పరిష్కారంతో పాటు జవాబుదారుతనాన్ని పెంపొందింపచేయడం కోసం జిల్లా మేజిస్ట్రేటుకు, అదనపు జిల్లా మేజిస్ట్రేటుకు జెజె (జూవినైల్ జస్టిస్) చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం దత్తత తీసుకొనే ఆదేశాలను జారీ చేసే అధికారాన్ని ఇవ్వడమైంది. ఈ చట్టాన్ని సాఫీగా అమలు అయ్యేటట్లు చూసేందుకు జిల్లా మేజిస్ట్రేటులకు అధికారాలు ఇవ్వడమైంది. దీనితో, సంకట స్థితిలో బాలలకు మేలు చేసే విధంగా సమన్విత ప్రయత్నాలను చేపట్టడానికి వీలు చిక్కుతుందన్న మాట. సీడబ్ల్యూసీ సభ్యుల నియామకానికి సంబంధించి అర్హత ప్రమాణాలను నిర్వచించడం, ఇంతకు ముందు నిర్ధారణ కానటువంటి అపరాధాలను ‘తీవ్రమైన అపరాధం’గా వర్గీకరించడం వంటివి కూడా ఈ ప్రతిపాదనలలో ఇతర అంశాలుగా ఉన్నాయి. చట్టంలోని వివిధ నిబంధనలను అమలు చేయడంలో ఎదురుకాగల ఇబ్బందులను కూడా తీర్చడం జరిగింది.