న్యూఢిల్లీ, నవంబర్ 22 (న్యూస్‌టైమ్): కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన స‌మావేశ‌మైన‌ ఐఎంఏసీ (ఇంటర్ మినిస్టీరియల్ అప్రూవల్ కమిటీ) రూ.320 కోట్లకు పైగా విలువైన 28 ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.107.42 కోట్ల మేర ఎంఎఫ్‌పీఐ వారి గ్రాంట్ ల‌భించ‌నున్న ఈ ప్రాజెక్టుల‌కు ఐఎంఏసీ అమోదం తెలిపింది. ప‌ది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులు ద్వారా దాదాపు ప‌ది వేల ‌మందికి ఉపాధి ల‌భించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎంఏసీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధాన‌ మంత్రి కిసాన్ సంపాద యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఆహార ప్రాసెసింగ్, సంరక్షణ సామర్థ్యాల విస్తరణ (సీఈఎఫ్‌పీపీసీ) (యూనిట్ స్కీమ్) కింద అవసరమైన గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌ను అందించే విష‌య‌మై ప్రాజెక్టుల ప్ర‌తిపాద‌న‌ల‌ను పరిశీలించారు. ఈ స‌మావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ స‌హాయ మంత్రి రామేశ్వ‌ర్ తేలీ కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి ప్ర‌మోట‌ర్లు వ‌ర్చువ‌ల్ విధానలో హాజ‌ర‌య్యారు.

ఈ 28 ప్రాజెక్టులు రోజుకు 1237 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సృష్టించ‌నున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జ‌మ్ము, కాశ్మీర్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ 28 ప్రాజెక్టులలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన దాదాపు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.48.87 కోట్లు. వీటికి రూ. రూ.20.35 కోట్ల మేర గ్రాంట్ సాయం లభించ‌నుంది.