శిక్షలే శరణ్యమా? ఉసిగొల్పే మూలాలో?

145

(కుమార్ యాదవ్)

తీవ్రమైన దుర్ఘటనలకు శిక్షలు సముచితమే. ఐతే శిక్షలు ఉన్నా ఘటనలు జరుగుతున్నాయంటే వాటికి కారకమౌతున్న అంశాల నిర్మూలనపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదా? ముఖ్యంగా సెల్ ఫోన్లలో ఫోర్న్ వీడియోలు నిషేధించాలి. కఠినంగా అమలుచేయాలి. ఇదే చాలా ప్రభావం చూపుతున్న అంశం. టీవీ సీరియల్స్, సినిమాలల్లో కామెడీ పేరిట ,సీరియల్స్ , సినిమాలూ… వంటి వాటిల్లో ద్వందార్థాలు, స్త్రీలను అలంకరణగా చూపే రెచ్చగొట్టే వేషధారణలు, డైలాగ్స్, పదాలు, వాక్యాలు వాడకంపై నిబంధనలు కఠినం చేయాలి.

ముఖ్యంగా హైస్కూల్ స్థాయినుండీ ఆపై విద్యాలయాల్లో పాఠ్యాంశాల సమాచారాన్ని లైబ్రరీలలో అందుబాటులో లేకుండా నెట్‌లో సేకరించే తరహా తప్పనిసరి పనిని విద్యాసంస్థలు ప్రోత్సహించడాన్ని కట్టడి చేసి తీరాలి. దీనివలన పిల్లలకు డిగ్రీ స్థాయివరకూ 3జీ, 4జీ సపోర్ట్ వీడియో ఫోన్లు కొనివ్వాల్సిన, అపరిమిత నెట్ బ్యాలెన్సు డేటా వినియోగం తప్పనిసరౌతోంది. దీంతో తల్లితండ్రులకు దూరంగా పిల్లలు ఫోన్లను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో దృష్టిపెట్టలేని పరిస్థితి ఉంది. ఈ విధానం సంస్కరింపబడి డిగ్రీ స్థాయి వరకూ కాలేజీల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడకాన్ని ఆపేయాలి. విద్యాసంస్థలకూ కఠిన నిబంధనలను విధించాలి.

అమ్మాయిలూ జాగ్రత్త… అని ఆడపిల్లల తల్లితండ్రులు చెప్పినట్లు అబ్బాయిల ఆలోచనా ధోరణులనూ, పెడత్రోవ పట్టకుండా, మగపిల్లాడనే పూర్తిస్వేచ్చనివ్వకుండా ఆడబిడ్డలపట్ల ప్రవర్తించాల్సిన తీరును అపుడపుడూ గుర్తు చేస్తూ, మనసిక మార్పుకు దోహదపడాలి. ర్యాగింగ్ భూతాన్ని కట్టడిచేసినట్లుగా, పద్దెనిమిదేళ్ళలోపు అమ్మాయిలు, అబ్బాయిల వ్యవహారశైలిలల్లో పరిమితులు అమలుచేయాలి. పార్కులలో విద్యార్థినీ, విద్యార్థులు జంటలుగా విహరించడంపైనా ఆజ్ఞలు ఉండాలి. ప్రాథమిక స్థాయినుండే కుటుంబాలు, బంధాలు, గౌరవం, సమాజం, శిక్షలు వంటి అంశాలపై పాఠ్యాంశాల బోధన జరగాలి. హైస్కూల్ స్థాయినుండీ డిగ్రీస్థాయి వరకూ ప్రతీ మూడు లేదా నాలుగు నెలల వ్యవధికీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహనా సమావేశాలు ఏర్పాటుచేసి కఠిన నిబంధనలూ, శిక్షలూ, సమస్య వచ్చనపుడు అనుసరించాల్సిన సంరక్షణ పద్దతులను విరివిగా ప్రచారం చేయాలి. సంఘం గౌరవం, భవిష్యత్ ప్రభావాలూ, విలువలు ముఖ్యంగా వారి డ్రస్ కోడ్ వంటి వాటి గురించి చర్చచేయడాలూ, హెచ్చరికలూ వంటివి తప్పని సరిగా చేయాలి.

ఇలా నిరంతరంగా కొనసాగినపుడు దుర్ఘటనలుకు ఆస్కారం తక్కువ. అలాకాకుండా ఘటనలు జరిగాక తీవ్రంగా పట్టించుకోవడం వలన అటు బాధితులూ, ఇటు నిందితుల వైపూ ఇరువైపుల వారి జీవితాలు కడతేరడం బాధాకరమే. ముందస్తు కట్టడికి అధిక ప్రాధాన్యత, చొరవకు ప్రభుత్వాలు, న్యాయస్థానాలూ ఉపక్రమించాలి, తల్లితండ్రులూ ,సమాజమూ చిత్తశుద్ధితో సహకారాన్ని అందించాలి. అపుడే ఏ శిక్షలైనా, చర్యలైనా సమంజసంగానూ, నైతికతతోనూ విజయం సాధించినట్లౌతుంది.

ఇకమీదటైనా విజ్ఞులు, ఉన్నతులూ, న్యాయకోవిధులూ నిశితాధ్యయనం చేసి ఇదివరకటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఘటన జరిగాక కఠినత్వాన్ని చూపడంకన్నా ముందస్తు నివారణలకు కూడా అధిక శ్రద్ద చూపి, ఘోరాలను జరగకుండా నివారించడానికి అధిక ప్రాధాన్యతనివ్వడం మరింత న్యాయమని గుర్తిద్దాం. మరిన్ని ఘోరాల్ని నిలువరిద్దాం.

(రచయిత, చిత్తూరు జిల్లా బీసీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు)