ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం

123
నవ వధువు కృష్ణవేణి

హైదరాబాద్, నవంబర్ 28 (న్యూస్‌టైమ్): ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమా తరహాలో మృతి చెందిన మహిళకు ఇక్కడి వైద్యులు ట్రీట్‌మెంట్ చేసి డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై మృతురాలి బంధువులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. కామినేని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగానే కృష్ణ వేణి(25) అనే మహిళ మృతి చెందిందని బాధితులు ఆరోపించారు.

ఆసుపత్రిలో చేరిన కేవలం 24 గంటలు గడవకముందే నవ వధువు మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. జ్వరంతో బాధపడుతున్న కృష్ణవేణిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువస్తే చివరికి మృతదేహంగా అప్పగించిన ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పట్ల బాధిత కుటుంబం దుమ్మెత్తిపోస్తోంది.

చికిత్స నిమిత్తం చేరినప్పుడు 30 వేల రూపాయలు, ఈరోజు 70 వేల రూపాయలు కట్టించుకున్న తర్వాత చనిపోయిందని తమకు ఆసుపత్రి వర్గాలు తెలిపారని బంధువుల ఆరోపిస్తున్నారు. యాచారం మండలం మల్కిజీగుడెంకు చెందిన నవ వధువు మృతి ప్రాణాలు కోల్పోయింది. గత నెల 10వ తేదీన పెళ్లి జరిగిందని సమాచారం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన యువకునితో ఈ యువతికి వివావం జరిగింది. మృతి చెందిన కృష్ణవేణి తండ్రి జంగయ్య ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. మరో లక్ష రూపాయలు కడితేనే మృతదేహాన్ని అప్పజెపుతామని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేయడంతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తమకు న్యాయం చేయాలని ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మీడియా ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో యాజమాన్యం బాధితులతో కాళ్లబేరానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, తమకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చుతారని కృష్ణవేణి కుటుంబ సభ్యులు చివరి వరకూ ఆందోళన చేపట్టడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.