న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): ఇండియ‌న్ రైల్వే 2020-21 ఒక్క సంవ‌త్స‌రంలోనే 6.015 రూట్‌ కిలోమీట‌ర్లు ( ఆర్‌.కె.ఎం) మేర గ‌రిష్ఠ స్థాయిలో విద్యుదీక‌ర‌ణ చేప‌ట్టింది. కోవిడ్ మ‌హ‌మ్మారి ఉన్న‌ప్ప‌టికీ 2018-19 సంవ‌త్స‌రంలో సాధించిన 5,276 ఆర్‌.కె.ఎంల‌ను రైల్వే దాటింది. 2020-21 కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కూడా ‌రైల్వే విద్యుదీక‌ర‌ణ‌లో 6000 కిలోమీట‌ర్ల‌పైగా మైలురాయిని దాట‌డం భార‌తీయ రైల్వేలు గ‌ర్వించ‌ద‌గిన స‌మ‌యం. దీనితో భార‌తీయ రైల్వేల ప‌ర్యావ‌ర‌ణ హిత క‌ర‌మైన ఇంధ‌న భ‌ద్ర‌త క‌లిగిన సంస్థ‌గా రూపుదిద్దుకుంటున్న‌ది.

భార‌తీయ రైల్వేకి సంబంధించి తాజాగా బ్రాడ్‌గేజ్ నెట‌వ‌ర్క్ 63,949 రూట్‌కిలోమీట‌ర్లు (ఆర్‌.కె.ఎం) కొంక‌ణ్‌ రైల్వేతో కూడా క‌లుపుకుంటే 64,689 రూట్‌ కిలోమీట‌ర్లు. ఇందులో 45,881 రూట్ కిలోమీట‌ర్లు అంటే 71 శాతం గత నెలాఖరుకు విద్యుదీక‌రణ పూర్తయింది. ఇటీవ‌లి కాలంలో రైల్వే విద్యుదీక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింది. దేశం దిగుమ‌తి చేసుకుంటున్న పెట్రోలియం ఆధారిత ఇంధ‌న వ‌న‌రుల వినియోగం త‌గ్గించ‌డానికి, దేశ ఇంధ‌న భ‌ద్ర‌త‌ను పెంపొందించ‌డానికి, ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర మైన‌, ఇంధ‌న సామ‌ర్థ్యంతో కూడిన స‌మ‌ర్ధ‌మైన ర‌వాణా దార్శ‌నిక‌త‌తో రైల్వే విద్యుదీక‌ర‌ణ‌పై దృష్టిపెట్ట‌డం జ‌రిగింది. 2014-21 సంవ‌త్స‌రాల మ‌ధ్య గ‌త ఏడు సంవ‌త్స‌రాల‌లో 2007-14 సంవ‌త్స‌రాల మ‌ధ్య సాధించిన విద్యుదీక‌ర‌ణ‌తో పోల్చిన‌పుడు 5 రెట్లు ఎక్కువ విద్యుదీక‌ర‌ణ జ‌రిగింది.

2014నుంచి రికార్డు స్థాయిలో 24,080 ఆర్‌.కె.ఎం (ప్ర‌స్తుత బ్రాడ్‌గేజ్ రూట్ల‌లో 37 శాతం) విద్యుదీక‌ర‌ణ కాగా 2007-14 మ‌ధ్య 4,337 ఆర్‌కెఎం (ప్ర‌స్తుత బ్రాడ్‌గేజ్‌రూట్ల‌లో 7 శాతం) విద్యుదీక‌ర‌ణ జ‌రిగింది. మొత్తం విద్యుదీక‌ర‌ణ జ‌రిగిన 45,881 ఆర్‌.కె.ఎంల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 34 శాతం విద్యుదీక‌ర‌ణ గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లోనే జ‌రిగింది. ఇండియ‌న్ రైల్వే రికార్డు స్థాయిలో 56 టిఎస్ఎస్‌ల‌ను (ట్రాక్ష‌న్ స‌బ్ స్టేష‌న్ల‌ను) 2020-21 సంవ‌త్స‌రాల‌లో ఏర్పాటు చేసింది.

అంత‌కు ముందు వీటి ఏర్పాటు సంఖ్య గ‌రిష్ఠంగా 42. కోవిడ్ మ‌హ‌మ్మారి ఉన్న‌ప్ప‌టికీ 33 శాతం మెరుగుద‌ల సాధించింది. గ‌త ఏడు సంవ‌త్స‌రాలో 201 ట్రాక్ష‌న్ స‌బ్ స్టేష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇండియ‌న్ రైల్వే 2023 డిసెంబ‌ర్ నాటికి ట్రాక్‌ల‌న్నింటినీ విద్యుదీక‌రించాల‌ని ప్ర‌ణాళిక రూపొందించింది. మొత్తం రైల్వే విద్యుదీక‌ర‌ణ వ‌ల్ల 2030 నాటి ఉద్గారాలు పూర్తిగా లేకుండా చేయాల‌న్న‌ది ల‌క్ష్యం. అది కూడా దాని మొత్తం విద్యుత్ అవ‌స‌రాల‌ను పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల ద్వారా స‌మ‌కూర్చుకోనున్న‌ది.