హిందూపురంలో బెల్ట్ షాపులపై దాడులు

3219

అనంతపురం, నవంబర్ 4 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం గొలుసుకట్టు దుకాణాలపై నియంత్రణ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించిన ఒకటో పట్టణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

స్థానిక పరిగి రోడ్లో అక్రమంగా మద్యం నిల్వచేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు సంబంధిత దుకాణంపై దాడి జరిపి నరసింహారెడ్డి (40)ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆయన వద్ద అక్రమ మద్యం లభించింది. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా నిందితుడు మద్యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండుకు తరలించారు.