రూ. కోట్లలో వ్యాపారం.. పుట్టగొడుగుల్లా దుకాణాలు…

(* ఎం. రాజా)

‘రుణం’ పేరిట కొందరు ఫైనాన్సర్ల అవతారం ఎత్తి అందినకాడికి దోచుకునే పనిలో పడ్డారు. ఫైనాన్సు ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటో మొబైల్ వ్యాపారంలో బడా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వీరికి ఎక్కువగా బడుగు వర్గాలకు చెందిన వారే టార్గెట్ అవుతున్నారు.

యువత కోరికలు, బలహీనతలే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పట్టణాల నుంచి నగరాలకు సైతం విస్తరించిన బైక్ ఫైనాన్సు సంస్థలు ద్విచక్ర వాహనదారులను నిలువుదోపిడీ చేస్తోన్నాయి. వివిధ ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు, పలు రంగాలకు చెందిన కూలీలు తమ పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాలి. అరకొర వేతనం, లేక కూలీతో బైక్ కొనాలంటే కష్టం. స్థిరాదాయం లేనందున మోటారు సైకిల్ కొనుగోలుకు నగదు అప్పిచ్చేవారు ఉండరు. ఇటువంటి వారి అవసరాలను సొమ్ము చేసుకోవడానికి బైక్ ఫైనాన్సు కంపెనీలు పుట్టుకొచ్చాయి. సామాన్యుడికి సులువుగా అప్పులిచ్చి నిలువు దోపిడీ చేస్తున్నాయి.

అసలు వ్యాపారులు గుంటూరు జిల్లా కారంపూడి వంటి చిన్న చిన్న పట్టణాలలో ప్రధాన కార్యాలయాలు ప్రారంభించి బ్రాంచీలుగా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు. కారంపూడి పట్టణంలో అధికారికంగా, అనధికారికంగా దాదాపు 60 నుంచి 100 మంది బైక్ ఫైనాన్సు వ్యాపారాలే చేస్తున్నారు. కారంపూడి ఫైనాన్సు అంటే తెలుగు రెండు రాష్ట్రాలలో పరిచయం లేని వ్యక్తులు లేరనే చెప్పాలి. ఈ రెండు రాష్ట్రాలలో విస్తరించిన వ్యాపారాలు వీరి వద్ద ఫైనాన్సు తీసుకొని మోసపోయిన బాధితులు అధికంగా ఉన్నారని విశ్వసనీయంగా సమాచారం.

రిజర్వు బ్యాంకు అనుమతి ఎంత మందికి ఉంది?

చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి యువకులు, విద్యార్థులకు ఎలాంటి షరతులూ లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో బైక్‌లను నెలవారీ చెల్లింపుల పద్ధతిలో విక్రయిస్తున్నారు. దీంతో జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్నాక అసలు కష్టాలు మొదలవుతున్నాయి. బైక్ సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్సియర్లు చెప్పిన చోటల్లా కొనుగోలుదారులు సంతకాలు చేసేస్తున్నారు. దీంతో బైక్ మీద వీరికి ఎటువంటి హక్కూ లేకుండాపోతోంది. నెల వాయిదా ఆలస్యమైతే ఈ మొత్తం రోజు వారీ వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదా వసూలుకు ఎన్నిసార్లు వస్తే అంత వసూలు చార్జీలు అదనంగా చెల్లించాలి.

ఇదంతా అప్పడికప్పుడు తెలియదు. వాయిదాలన్నీ తీరాక బైక్ ఆర్‌సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖర్లో చెప్తారు. అప్పుడు లబోదిబోమన్నా లాభం లేదు. ఎందుకంటే బైక్ హక్కులు తమ పేరున లేకపోవడంతో నోరెత్తకుండా చెల్లించి బయటపడుతున్నారు. కాగా, ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నారు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్సియర్ మనుషులు స్వాధీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బు వెనక్కి ఇవ్వరు. రెండు నెలల వ్యవధిలోనే వాహనదారుడికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అదే ద్విచక్ర వాహనాన్ని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలామంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు.

ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరిస్థితి లేకున్నా, ఒత్తిడి చేయడంతో ఫైనాన్సుల్లో బైక్‌లు ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలల పాటు ఫైనాన్సు డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్థుల ఇళ్ల వద్ద ఫైనాన్సియర్లు గొడవ చేస్తే పరువుపోతుండటంతో పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీర్చిన దాఖలాలున్నాయి. బైక్ అనేది నేడు గ్రామాల్లో సైతం స్టేటస్ సింబల్‌గా మారడంతో చాలామంది వీటిని సొంతం చేసుకునేందుకు పట్టణాలకు వచ్చి ఫైనాన్సు సంస్థల ఉచ్చులో పడిపోతున్నారు. అయితే, ఫైనాన్సు వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం, తీసుకునే వాడి అవసరం అన్నట్లు ఉంటుంది.

ఈ లావాదేవీలపై ఎటువంటి పన్ను లెక్కలోకి రావడంలేదు. వడ్డీపై లాభాలు వస్తున్నా ఇది కూడా ఐటీ శాఖ పరిధిలోకి వెళ్లడం లేదు. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్సు శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, మున్సిపల్ శాఖ అధికారులుగానీ చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ఈ వ్యాపారం మాఫియాలా మారి దోపిడీకి తెగబడుతోంది.

కరోనా కష్టాల్లోనూ ఈఎంఐలు చెల్లించాలని బెదిరింపులు…

ఆటోనగర్‌ యార్డులో ఉంచిన బకాయిదారుల వాహనాలు

కరోనా పట్టి పీడిస్తూ, కేసులు విపరీతంగా పెరుగుతుంటే, లాక్‌డౌన్ తొలగించినా పనులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి తరుణంలోనూ ఫైనాన్సు వ్యాపారులు కనీస కనికరం కూడా లేకుండా ఈఎంఐ (వాయిదా)ల వసళ్లకు తెగబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా వ్యాపారుల వద్ద పనిచేస్తున్న వ్యక్తులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ రుణగ్రహీతలకు ఫోన్ చేసి వెంటనే ఈఎంఐలు చెల్లించాలని బెదిరిస్తుండడం శోచనీయం. పనులు లేక ఇల్లు గడవటమే కష్టంగా ఉండటంతో కొంత గడువు కావాలని కోరినా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం రుణాలపై మారటోరియం విధించినా అది తమకు సంబంధం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ బకాయిలు చెల్లించకపోతే, ఇంటికి వచ్చి వాహనాలూ, వస్తువులు స్వాధీనం చేసుకుంటామని, మీ పరువే పోతుందని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

సదరు ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

ఇదిలావుండగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మహానగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ సైతం ఆటో ఫైనాన్షియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాల విషయంలో డీలర్లను కట్టడి చేస్తున్న రవాణా శాఖ అధికారులు, ఫైనాన్షియర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లకు, ట్రాఫిక్‌ పోలీసులకు, చివరకు రవాణా శాఖకు సైతం ఆటో ఫైనాన్షియర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ విధానాలు వీరికి కాసులు కురిపిస్తుండగా, ఆటో డ్రైవర్లు మాత్రం కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. తమ పరిధిలోకి రాని ఫైనాన్షియర్లను ఏమీ చేయలేని దుస్థితిలో ట్రాఫిక్‌, రవాణా శాఖలున్నాయి. నగరంలో తిరుగుతున్న చాలా ఆటోలకు యజమాని ఒకరైతే, డ్రైవర్‌ మరొకరు ఉంటున్నారు. ఇది రవాణా శాఖకు, ట్రాఫిక్‌ పోలీసులకు తెలిసిన విషయమే. అంతా తెలిసినా అధికారులు మాత్రం వారిపై చర్యలు తీసుకోలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో వారి ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండాపోతోంది. ఆటో ఫైనాన్షియర్లపై కఠినంగా వ్యవహరించాలని డ్రైవర్లు, యూనియన్‌లు డిమాండు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

కోట్లల్లో వ్యాపారం.. అడ్డగోలుగా ఆటో ఫైనాన్సింగ్…‌

నగరంలో కోట్లాది రూపాయల వ్యాపారం. 1.20 లక్షల వరకు ఉన్న ఆటో రిక్షాల్లో 60 శాతం ఫైనాన్షియర్ల చేతుల్లో ఉన్నాయని అంచనా. అక్రమ పద్ధతిలో ఆటో ఫైనాన్షియర్లు చేస్తున్న దందా నగరంలో మూడు పువ్వులు… ఆరు కాయలుగా సాగుతోంది. రోజంతా నడుపుతున్న ఆటో డ్రైవర్లు మాత్రం అప్పుల ఊబిలో, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్‌ మీటరు మీద రావడానికి ఇష్టపడడం లేదు. డిమాండుతోనే డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికులను చేరవేస్తున్నారు. నగరంలో ఆటోమీటర్లు పేరుకు మాత్రమే ఉన్నాయని, మీటరుపై ఎవరూ రావడం లేదని ప్రయాణికులు ఒకవైపు వాపోతున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు సృష్టిస్తున్న ఆటోలకు ఇ- చలాన్‌లు వేస్తే ఎవరికి వెళుతున్నాయో తెలియని పరిస్థితి. ఏ ఆటోకు ఎవరు యజమానో రవాణా శాఖకు సైతం తెలియని పరిస్థితి నగరంలో ఉంది. ఇదే విషయమై ట్రాఫిక్‌ పోలీసులు పలుమార్లు రవాణా శాఖను సంప్రదించి ఆటోలతో వస్తున్న ఇబ్బందులను వివరించారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌ నగరంలో ఆటోల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియర్ల చేతుల్లోకి ఆటోలు వెళ్లకుండా అర్హులైన, నిజమైన ఆటో డ్రైవర్‌ పేర్లమీదే రిజిస్ర్టేషన్‌ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రవాణా శాఖపై ఉంది. నగరంలో ఆటో ఫైనాన్షియర్ల చర్యలు శృతిమించి పోతున్నాయి. ఫైనాన్స్‌లో ఆటోను తీసుకున్న వారు సకాలంలో వాయిదాను చెల్లించని పక్షంలో వారి నుంచి వాహనాన్ని ఫైనాన్షియర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలన్నీ వారి దగ్గరే ఉండడంతో ఆటోడ్రైవర్లు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఒకే వాహనాన్ని పలువురికి విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారే తప్ప తమ ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాగ్‌లింగంపల్లికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ వాపోయారు. వాయిదాలను చెల్లించకపోతే ఆటోలను సీజ్‌ చేసే విధానంలో చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నా అడిగే వారు లేకుండాపోయారన్నారు.

ఇప్పటికైనా నగరంలో నిబంధనలకు విరుద్ధంగా, ఆటో డ్రైవర్లపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న ఫైనాన్షియర్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డ్రైవర్లు, ఆటో సంఘాల నాయకులు కోరుతున్నారు. ఎవరైనా ఆటో ఫైనాన్సు చేయాలంటే ముందుగా రిజర్వుబ్యాంకు నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఆ తరువాత నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కానీ ఈ రెండు విషయాల్లోనూ ఆటో ఫైనాన్షియర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. నగరం కేంద్రంగా వందకు పైగానే ఆటో ఫైనాన్షియర్లు తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.

జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఆటోలను నడుపుకుంటున్న వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ, వారిని దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నా రని తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ సమాఖ్య ప్రధానకార్యదర్శి ఎ.సత్తిరెడ్డి ఆరోపించారు. ఆటోలను ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ఒరిజినల్‌ ధ్రువపత్రాలు వారి దగ్గర లేకపోవడంతో చలాన్లు రాస్తున్నారని వాపోయారు. దీంతో ఆటో డ్రైవర్లు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం ట్రాఫిక్‌ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారే తప్ప, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోలే కపోతున్నారని యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

(* వ్యాసకర్త: ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్)