అవసరాలకు సరిపడా ఇసుక లభ్యత

32

ఏలూరు, మే 21 (న్యూస్‌టైమ్): జిల్లాలో స్దానిక అవసరాలకు సరిపడా ఇసుకను వివిధ రీచ్‌ల నుండి తీయడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె.వెంకట రమణారెడ్డి తెలిపారు. గురువారం అమరావతి నుండి పంచాయితీరాజ్, రూరల్ డవలప్‌మెంటు, మైన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ దివేది జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టా భూములలో 11 రీచ్‌లు ఉన్నాయని వాటిలో 4 రీచ్‌ల నుండి మాత్రమే ఇసుక తీస్తున్నామని, 7 రీచ్‌లకు సంబంధించి అగ్రిమెంటు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. 4 ఓపెన్ రీచ్‌ల్లో ఇసుకు తీయడానికి సమస్య ఉందని వాటిని ముగించి వేరే ఓపెన్ రీచ్‌లు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. కొన్ని మండలాల్లో రెడ్ జోన్లగా ప్రకటించడం వల్ల ఆయా మండలాల్లో ఇసుక తీయడానికి ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన వివరించారు.

ఈ సందర్బంగా గోపాలకృష్ణ దివేది మాట్లాడుతూ వచ్చే అక్టోబరు వరకూ సరిపోయే విధంగా రిజర్వ్ స్టాక్ ఉంచేందుకు తగుచర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు. దీనికోసం ప్రత్యేకించి ఎక్కువ ఇసుక తీసే విధంగాను, దానిని ట్రాన్స్‌పోర్టు చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. ఇసుక తీయడానికి లేబరు సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జేసీలకు సూచించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో జిల్లా శాండ్ అధికారి సత్యనారాయణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.