చేపల బజార్ తరలింపు ఎందుకంటే?

0
10 వీక్షకులు
ముషీరాబాద్ (రాంనగర్)లో ప్రస్తుత చేపల మార్కెట్ (File photo)
  • ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ బస్ భవన్ పక్కకు…

హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళిన కారణంగా హైదరాబాద్ నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌లో ఉన్న హోల్ సేల్ చేపల మార్కెట్‌ను తాత్కాలికంగా ఆర్టీసీ బస్ భవన్ పక్కన ఉన్న స్థలంలో ఆదివారం (ఏప్రిల్ 26వ తేదీ) నుండి నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీచేసిన మంత్రి శనివారం నుంచి ముషీరాబాద్ మార్కెట్‌లో అమ్మకాలను పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. ముషీరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న హోల్ సేల్ చేపల మార్కెట్ రెడ్ జోన్ పరిధిలోకి రావడంతో మార్కెట్‌లో కార్యకలాపాలు ఇప్పటికే నిలిచిపోయాయిన విషయం తెలిసిందే.

సాధారణ రోజుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున చేపలను ముషీరాబాద్ మార్కెట్‌కు తీసుకువస్తుంటారు. ఇక్కడి వ్యాపారులు ఆయా చేపలను కొనుగోలు చేసి వివిధ రిటైల్ మార్కెట్‌లకు తరలించి అక్కడ విక్రయిస్తారు. ప్రస్తుతం ముషీరాబాద్ మార్కెట్‌లో కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా జిల్లాల నుండి చేపల రవాణా కావడం కూడా దాదాపు ఆగిపోయింది. తద్వారా నగర పరిధిలో చేపల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి ప్రస్తుతం ముషీరాబాద్‌లో ఉన్న హోల్ సేల్ చేపల మార్కెట్‌ను ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్ భవన్ పక్కకు తరలించాలని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఈ మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, ప్రజలు సామాజిక/భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఒకప్పుడు ముషీరాబాద్‌లోని ఒక పార్క్‌ చుట్టూ కొందరు బెస్తవాళ్లు రోజువారీగా కొద్ది మొత్తంలో చేపలు అమ్ముకునేవారు. ఇక్కడ ఏళ్ల తరబడి అమ్మకాలు జరపడంతో ఈ చేపల మార్కెట్‌ చివరకు హోల్‌సేల్‌ మార్కెట్‌గా తయారైంది. 20 ఏళ్ల కిందట ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌కు ఒక లారీ వెళితే చేపల ధర కిలోకు అనూహ్యంగా పడిపోయేది. అలాంటిది కరోనా ప్రభావం తాకకముందు వరకూ 20 నుంచి 30 లారీలు వెళ్లినా ఉదయం పదకొండు గంటల వరకు అన్నీ అమ్ముడైపోతున్నాయి. ఈ మార్కెట్‌కు తెల్లవారుజామున 4 గంటల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీసీఎం, లారీల్లో చేపలు దిగుమతవుతాయి.

జంట నగరాల్లోకెల్ల పెద్దదైన ఈ మార్కెట్‌కు ఉదయం 5 గంటలకే పెద్దఎత్తున జనాలు చేరుకుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మడానికి ఈ మార్కెట్‌లోనే కొంతమంది కొనుగోలు చేసుకొని వెళ్తారు. ఇక్కడి ధర కంటే గిట్టుబాటు చూసుకొని అమ్మకాలు జరుపుతారు. ముషీరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలవారు ఈ మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తారు. నగరంలోని పెద్ద పెద్ద స్టార్‌ హౌటల్స్‌, రెస్టారెంట్లకు ఈ మార్కెట్‌ నుంచే చేపలు సరఫరా అవుతాయి.

తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, వరంగల్‌, ఆదిలాబాద్, కరీంనగర్‌, సిద్ధిపేట, సూర్యాపేట, కోదాడ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేపలు దిగుమతి అవుతాయి. ఈ చేపలు తాజాగా ఉండటం కోసం ప్రత్యేకమైన ఐస్‌ బాక్స్‌ల్లో పెట్టి తీసుకొస్తారు. ఈ చేపల మార్కెట్‌లో కొర్రమీను, రవ్వలు, బొచ్చలు, అలుగలు, పాంప్లేట్లు, టైగర్‌ రొయ్యలు, పాపేర, జెల్లలు, బంగారు తీగ, మర్తగుంజ చేపలు, పీతలు, రొయ్యలు, మెరిగలు, సీ ఫిష్‌లు దొరుకుతాయి. కొర్రమీను కిలోకు రూ.550 వరకు ధర పలుకుతుంది.

కిలోకు రూ.80 నుంచి 100 వరకు రవ్వలు, బొచ్చెలు అమ్ముడుపోతున్నాయి. నగరంలోని వేరే ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే ఇక్కడి ధర కంటే అధనంగా రూ.20 నుంచి 30 వరకు చెల్లించాల్సి వస్తుంది. కాగా, ఈ మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే చేపల్ని శుభ్రం చేసి, ముక్కలుగా కత్తిరించిస్తారు. ఇందుకోసం కిలోకు రూ.10 తీసుకుంటారు. ఇక్కడ ఉండే వసతి వల్ల నగరంలోని ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్‌బినగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, పాతబస్తీ తదితర ప్రాంతాలవారు ఇక్కడకు వచ్చే కొనుగోలు చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అతిపెద్ద చేపల మార్కెట్‌గా పేరుగాంచిన ముషీరాబాద్‌లో సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు, స్థానికులు, వచ్చిపోయేవారికి ఇక్కట్లు తప్పడం లేదు. చేపల విక్రయాలతో వాటి వ్యర్థాలు, మురుగునీరు మార్కెట్‌ నుంచి రాంనగర్‌ వైపు వెళ్లే దారిలో శాస్త్రినగర్‌ వరకు రోడ్డుపైనే పారుతుంటాయి. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లారీలు, డీసీఎంలతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. కరోనా పుణ్యమాని మార్కెట్‌ను విశాలమైన ప్రాంతానికి తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ అయితే, ఇది తాత్కాలికమే కాకవడంతో భవిష్యత్తులోనైనా దీని గురించి ఆలోచన చేయాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here