భూపతిపాలెం ప్రాజెక్టు కింద బీడువారుతున్న భూములు

20624

కాకినాడ: గిరిసీమలో సాగుజలాలల గలగలపారించేందుకు కోట్లాదిరూపాయలు వెచ్చించి నిర్మించిన భూపతిపాలెం ప్రాజెక్టు పుష్కలంగా నీళ్లున్నా చుక్కనీరందక భూములు బీడువారుతున్నాయి. అంతే కాదు తూర్పుమన్యంలో గిరిపుత్రులు సాగునీటికోసం సాహసమే చేస్తున్నారు. తూర్పు మన్యంలో 23 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం-గెద్దాడల మధ్య భూపతిపాలెం ప్రాజెక్టు నిర్మించి రెండేళ్లయింది. తొలిదశలో రంపచోడవరం, గంగవరం మండలాల్లోని 11వేల 520 ఎకరాలకు ఖరీఫ్‌లో మాత్రమే సాగునీరందించాలని ఇరిగేషన్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి నీరు విడుదల చేశారు.

32కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించామని రికార్డుల్లో ఉన్నా అంత కాలువ నిర్మాణం ఇప్పటికీ పూర్తిచేయలేదు. భూసేకరణ సమస్య తలెత్తకూడదని ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందుగానే ప్రధాన కాలువ పనులు పూర్తిచేసారు. దీంతో ప్రాజెక్టు పూర్తయ్యేసరికి పిచ్చిమొక్కలు, చెట్లు మొలచి పూడిక చేరి కాలువ ద్వారా నీరు ముందుకుపోకుండా తయారయింది. పైగా ప్రధాన కాలువకు పిల్ల కాలువల నిర్మాణం, ఫీల్డ్‌చాల్స్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో పల్లపు భూములకు తప్ప కొండ ప్రాంతాలను ఆనుకుని ఉన్న భూములకు నీరందడం లేదు. డబ్బున్న వారు ప్రధానకాలువలో మోటార్లు ఏర్పాటుచేసుకుని పైపుల ద్వారా నీటిని తరలించుకుంటుండగా పేద రైతులు వారి భూములను బీళ్లుగానే వదిలేస్తున్నారు.

మన్యసీమకు నీరందించే ఈ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరేలా పనులు పూర్తిచేయాలని స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేసారు. ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చించి ప్రాజెక్టు పూర్తయ్యేలా చూస్తానంటున్నారు. వ్యవసాయం తప్ప మరో ఆధారం లేదని ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రభుత్వం ఆదుకోవాలని మన్యం వాసులు కోరతున్నారు.