కరోనాపై పోరులో మెరుగైన ఫలితాలు

0
6 వీక్షకులు

ఒంగోలు, మే 21 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తి, నియంత్రణకు చేపట్టిన తాజా పరిస్థితులను జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గురువారం సమీక్షించారు. ప్రకాశం భవనంలోని తన చాంబర్‌లో ఆయన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్లు జె.వెంకట మురళి, టీఎస్ చేతన్‌తో కలిసి మండలాల వారీగా కొవిడ్-19 వ్యాప్తి, నియంత్రణ చర్యలను సమీక్షించారు. మహమ్మారి కరోనా వ్యాప్తి పట్ల జిల్లా యంత్రాంగం ముందుగానే మేల్కొన్న కారణంగా భారీ నష్టాన్ని తగ్గించగలిగామని, ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా కొవిడ్-19పై పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

‘‘వ్యాధిని కట్టడిలో పెట్టడానికి యంత్రాంగం తీసుకున్న చర్యలకు జిల్లా ప్రజలు అందించిన సహకారం మరువలేనిది. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా వ్యాధిని నియంత్రణకు తోడ్పాటునందించారు’’ అని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని గ్రామాలు, కంటైన్‌మెంట్, బఫర్ జోన్లలో మరింత పటిష్టవంతంగా లాక్‌డౌన్ అమలుచేసి, లాక్‌డౌన్ సడలింపులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. వలస కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి, వారికి సరైన పునరావాసం, భోజనం ఏర్పాటుచేయాలని సూచించారు.

మరోవైపు, జిల్లాలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం దర్శిలో వచ్చిన పాజిటివ్‌తో కలిపి రోగుల సంఖ్య 67కి చేరుకుంది. వారిలో 63 మంది గతంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారి నమూనాల్లో మూడొంతుల పరీక్షలు పూర్తికాగా మూడు పాజిటివ్‌గా వచ్చాయి. కోయంబేడు వెళ్లి వచ్చిన వారి వివరాల సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం తెలుసుకొని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వారికి క్లియా, ట్రూనాట్‌ పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత వ్యాధి లక్షణాలు కనిపిస్తే వీఆర్‌డీఎల్‌ నమూనా సేకరిస్తున్నారు. గురువారం వచ్చిన ఫలితాలన్నీ నెగిటివ్‌ అని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు తెలిపారు.

కాగా, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఏపీ గురుకుల పాఠశాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ రిలీఫ్‌ సెంటరు నుంచి ఇద్దరిని ఒంగోలుకు తరలించారు. రెండు రోజుల క్రితం రిలీఫ్‌ సెంటరులోని సుమారు 60 మందికి రక్తనమూనాలను సేకరించి పరిక్షించారు. వీరిలో పాజిటివ్‌ అనుమానాలు రావడంతో వారిని మరో పరీక్షకు ఒంగోలుకు తరలించారు. మరోవైపు రిలీఫ్‌ సెంటరులో ఈవోఆర్డీ రామకృష్ణ పర్యవేక్షణలో రసాయనాలు చల్లించారు. హనుమంతునిపాడులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో గురువారం నాటికి 20 మందిని తరలించినట్లు తహసీల్దార్‌ రామకృష్ణశర్మ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి వలసకూలీలు ఇళ్లకు చేరుకోగా వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు కాలినడకన వెళ్తుతున్న 16 మంది వలస కూలీలను లింగసముద్రం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here