వరంగల్, అక్టోబర్ 19 (న్యూస్‌టైమ్): భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి, శాకంబరి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దయాకర్ రావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత, ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు మంత్రి దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతర మహా మండపంలో మంత్రి దంపతులకు వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలందించారు. వరంగల్‌ నగరంలోని భద్రకాళి ఆలయం పర్యాటక కేంద్రంగా మారనుందని, ఇందులో భాగంగానే హృదయ్‌, స్మార్ట్‌సిటీ పథకం నిధులతో భద్రకాళి బండ్‌ అభివృద్ధి చెందిందన్నారు.

‘‘అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నాను. కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని ఆకాంక్షించాను. అతి పురాత‌న‌, కాక‌తీయుల నాటి, ఎంతో పాటి ఉన్న ఆల‌యం భ‌ద్ర‌కాళి దేవాల‌యం. తెలంగాణ వ‌చ్చాకే, భద్రకాళి ఆలయం అభివృద్ధి చెందుతున్న‌ది. ట్యాంకు బండ్ నిర్మాణం జ‌రిగింది. ఆల‌య అభివృద్ధికి మ‌రింత కృషి జ‌రుగుతున్న‌ది. మొత్తం వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌ర‌బాద్ త‌ర‌హాలో, అభివృద్ధి ప‌రిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. కుడా ప‌రిధిలోనూ అద్భుత అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధ‌మైంది. సిఎం కెసిఆర్ తెలంగాణ‌ని, దైవికంగా, సాంస్కృతిక ప‌రంగా కూడా అభివృద్ధి ప‌రుస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు.’’ అని అన్నారు.